వైసీపీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. దాదాపు రెండున్నర లక్షల మంది రాష్ట్రంలో వాలంటీర్లుగా పని చేస్తున్నారు. వారందరికీ నెలకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనాలు అందుతున్నాయి. సాక్షి దినపత్రిక కొనుక్కునేందుకు వారికి నెలకు అదనంగా 200 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోంది.
ఆషామాషీ విషయం కాదిది. ప్రభుత్వ ఉద్యోగులకు సమాంతరంగా పని చేస్తున్న వ్యవస్థగా దీన్ని భావించాల్సి వుంటుంది. ఇంతకీ, ఈ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా తయారైంది.
చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలనేవి వుండేవి. అది పార్టీ తరఫున పని చేసేది. దానికి ప్రభుత్వం తరఫున అధికారిక చెల్లింపులు ఏమీ జరగలేదు. వాలంటీర్ వ్యవస్థ అలా కాదు. ప్రభుత్వం తరపున చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రతి యేడాదీ అదనంగా ప్రోత్సహకాలు కూడా ఇస్తోంది ప్రభుత్వం.
మరి, వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరు.? ఈ ప్రశ్నకు వైసీపీ సర్కారు సమాధానం చెప్పడంలేదు. ‘నేనే ఆ వ్యవస్థకి అధిపతిని..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడంలేదు. చీఫ్ సెక్రెటరీ అయినా, బాధ్యత తీసుకోవాలి కదా.?
వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనపై ప్రాసిక్యూషన్ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందిగానీ.. వాలంటీర్ వ్యవస్థకి ఫలానా వ్యక్తి అధిపతి.. అని మాత్రం చెప్పడంలేదు. సమాధానం చెప్పేస్తే, వివాదం ఇక్కడితో సమసిపోతుంది.
రేప్పొద్దున్న కోర్టుకైనాసరే.. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఆ పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరం ప్రభుత్వానికి.