వైకాపా ఓటమిపై పవన్ మౌనం… హర్ట్ అయ్యారా?

తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిందని అటున్నారు విశ్లేషకులు. అందుకు తగ్గట్లుగానే పార్టీల రెస్పాన్స్ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అన్యూహ్య విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో… ఈ ఫలితాలు రాబోయే ఎన్నికల ఫలితాలకు ట్రైలర్స్ అని.. ప్రభుత్వంపై వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ విచిత్రంగా… జగన్ పేరు చెబితే అంతెత్తున లేచే పవన్ మాత్రం ఈ ఫలితాలపై స్పందించలేదు!

వైసీపీకి వ్య‌తిరేకంగా ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా వెంట‌నే తానున్నానంటూ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స్పందిస్తూ వుంటారు. కారణం పూర్తిగా తెలియదు కానీ… జగన్ ని ఆజన్మశత్రువుగా భావిస్తుంటారు పవన్. అందుకే జగన్ చేసే ప్రతీ పనినీ బాబు కంటే బలంగా వ్యతిరేకిస్తుంటారు.. విమర్శిస్తుంటారు. అలాంటిది త‌న అన‌ధికార మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీకి అనుకూల ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో, ఆ ఆనందాన్ని ప‌వ‌న్ పంచుకోలేదు. అధికారపక్షంపై విమర్శలు చేయలేదు!

ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే… ఈ విషయంపై ఇప్పటికే విశ్లేషణలు మొదలైపోయాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు అని జనసేన అధికారికంగా ప్రకటించలేదు. అయినా కూడా జనసైనికులు టీడీపీకి మద్దతిచ్చి ఉంటారని.. టీడీపీ విజయంలో వాళ్లదే కీలకపాత్ర అని అంటున్నారు. అయితే… ఈ విషయాన్ని టీడీపీ ఏమాత్రం అంగీకరించనట్లుగానే స్పందిస్తుంది.

అంటే… తమ గెలుపులో జనసేన పాత్రలేదని, ఇది తమ సోలో విక్టరీ అని చెప్పాలనుకుటుంది. దీంతో పవన్ హర్ట్ అయ్యారని.. జనసైకులు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ చెప్పిన విషయాన్ని గంటా శ్రీనివాస్ ప్రస్థావించారు తప్ప.. ఇటు బాబు కాని, అటు చినబాబు కానీ, ఆఖరికి అచ్చెన్నాయుడుకానీ ప్రస్థావించలేదు. పైగా చినబాబైతే… అదంతా తన యువగళం పాదయాత్ర ఫలితం అని చెప్పేసుకుంటున్న పరిస్థితి!

దీనికితగ్గట్లు… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్ తో బాబు స్ట్రాంగ్ గా ఆలోచిస్తున్నారని.. పవన్ ముందు బెండయ్యే పరిస్థితి ఉండకపోవచ్చని.. జనసేన అడిగినన్ని కాదు – తాను ఇవ్వాలనుకున్నన్ని సీట్లు మాత్రమే ఇవ్వనున్నారనే కథనాలు రావడం కూడా… పవన్ మౌనాన్నికి కారణంగా చెబుతున్నారు. సో… బాబు గెలిచినా – జగన్ ఓడినా… పవన్ మౌనం అందుకే అని అంటున్నారు.

సో… చంద్రబాబు తనను అవసరం వచ్చినప్పుడు యోధుడిగా.. అవసరం తీరాక ఆటలో అరటిపండుగా చూస్తున్నారన్న విషయం పవన్ గ్రహించి ఉండొచ్చు!! మరి దీనిపై జనసేన భవిష్యత్తులో ఎలా స్పందిస్తుంది.. ఈ ఫలితాలు – అనంతరం బాబు ప్రవర్తనలో మార్పులు గమనించిన నేనాని.. ఎలాంటి ఆలోచనలు చేస్తారన్నది వేచి చూడాలి!