బీజేపీతోనే పొత్తు వుంటుందా.? బీజేపీ, టీడీపీలతో కలిసి పొత్తు పెట్టుకోవడమా.? అన్నది ముందు ముందు తేలుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సెలవిచ్చారు. విశాఖలో వారాహి యాత్ర ముగిసింది. ఈ క్రమంలో జనసేన అధినేత మీడియా ముందుకొచ్చారు.
మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో, పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థిత్వంపైనా జనసేనాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా వుంటుందని జనసేనాని వ్యాఖ్యానించడం గమనార్హం.
అంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఖరారు కాకుండానే, 2024 ఎన్నికల్లో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసి పోటీ చేయాలన్నది జనసేనాని అభిమతమన్నమాట. చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆయన్ని ‘దత్త పుత్రుడు’ పవన్ కళ్యాణ్ తన భుజానికెత్తుకుంటున్నారు.. అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు ఇది కౌంటర్ ఎటాక్ అనుకోవచ్చా.?
కాదు కాదు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. జనసేన పార్టీకి క్రమంగా బలం పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి కూటమి తరఫున కేటాయించే సీట్లు ఎక్కువ వుండాలన్న కోణంలో, జనసేనాని ఆచి తూచి అడుగులేస్తున్నారు.
2024 ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అవసరం. సో, కూటమిగా పోటీ చేసినా, ఆ కూటమిలోని పార్టీలకి.. మరీ ముఖ్యంగా జనసేనకీ ఖర్చు చేయాల్సి వుంటుంది టీడీపీ.. అన్నది ఓ వాదన. అందుకు టీడీపీ సమ్మతిస్తుందా.? అన్నది మళ్ళీ వేరే చర్చ. ముఖ్యమంత్రి పదవి విషయంలో ‘ఎన్నికల తర్వాత..’ అని జనసేనాని చెప్పడంతో, టీడీపీ అధినేత విలవిల్లాడతారన్నది మాత్రం నిర్వివాదాంశం.
