కొంతమంది నేతలకు పదవులైన ఉండాలి లేదా అధికార పార్టీ అండ అయినా ఉండాలి. లేకపోతే వారి రాజకీయం నడవదు. అందుకే తరచూ పార్టీలు మారుతూ ఉంటారు. అలాంటి నేతే తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి. ఒకప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్‌గా పనిచేసి బాగా పాపులర్ అయినా లీడర్. కాంగ్రెస్ హయాంలో మంచి పలుకుబడి కలిగినా పదవులు మాత్రం దక్కించుకోలేకపోయారు. దాంతో అలిగి టీడీపీలో చేరారు. చేరడమే ఆలస్యం ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు బాబుగారు. 1999 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందారు ఆయన. ఆ ఆటు తర్వాత టీడీపీలో కూడ కాంగ్రెస్సీనే రిపీట్ అయింది.
ఆ తర్వాత రెండు దఫాలు టికెట్ పొందలేకపోయిన ఆయన 2012లో టికెట్ దక్కించుకున్నా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన్ను పక్కనపెట్టేసిన బాబుగారు ఒక్కసారి మాత్రం టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి సంతోషపెట్టారు. కానీ రెండవసారి కూడ చైర్మన్ పోస్ట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. దాంతో పార్టీకి దూరం జరిగి 2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. చదవలవాడ అంటే పవన్ కు మంచి అభిమానం. ఆయన్ను పవన్ పెద్దన్నలా భావిస్తారని చెబుతుంటారు చాలామంది. అందుకే గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.
కానీ చదలవాడ దారుణంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత యథావిధిగా పార్టీకి దూరంగా ఉంటూ ప్రత్యామ్నాయాలను వెతకడం మొదలుపెట్టారు. ఆ వెతుకులాటలో ఆయనకు వైసీపీ తీగ తగిలింది. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈమధ్యే పెద్దిరెడ్డిని కలవడానికి చదలవాడ అపాయింట్మెంట్ కోరారట. పెద్దిరెడ్డి సైతం సానుకూలంగా స్పందించారట. ఒక్కసారి వీరిద్దరూ కలిసి సమావేశం పెట్టుకుంటే వైసీపీలోకి చదలవాడ ఎంట్రీకి రూట్ క్లియర్ అయిపోతుందని తిరుపతి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.