అప్పుడు తప్పు కాని అప్పు.! ఇప్పుడు తప్పెలా అయ్యింది.?

చంద్రబాబు హయాంలో అప్పు చేస్తే తప్పు కానప్పుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అప్పు జరిగితే తప్పెలా అవుతుంది.? తప్పు ఎవరు చేసినా అది తప్పే. ఒకరు చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్పు.. అవదు.! ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చంద్రబాబు హయాంలో జరిగిన అప్పుల్ని అప్పట్లో తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడేమో, అప్పు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో అవినీతి వుందనీ.. ఇప్పుడు అవినీతి లేదనీ వైసీపీ చెప్పడం మామూలే. అసలు అవినీతి లేని సమాజాన్ని మనం ఊహించుకోగలమా.? అవినీతి రహిత పాలన.. అనేది మాటలకే పరిమితం.

తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాల్సిందే. వైసీపీలో జరుగుతున్న అప్పుల్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం తప్పు కాదు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘అప్పు రత్న’ అనే బిరుదు ఇవ్వడమూ తప్పు కాకపోవచ్చు. కానీ, ఈ బిరుదుని ముందుగా చంద్రబాబుకి ఇవ్వాలి.

కానీ, ఆ సాహసమైతే పవన్ కళ్యాణ్ చెయ్యరుగాక చెయ్యరు. అదే అసలు సమస్య. చంద్రబాబుతో వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాల్సి వుంది పవన్ కళ్యాణ్‌కి. అదీ అసలు సమస్య. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదు అప్పుల విషయంలో.?

అసలంటూ అప్పు రత్న అనే పేరు మొదట పెట్టాల్సింది ప్రధాని నరేంద్ర మోడీకి కదా.? ఇంకా నయ్యం.. అలా గనుక పవన్ కళ్యాణ్ ట్వీటేస్తే ఇంకేమన్నావుందా.?