పవన్ కు అది ఫ్యాషన్ అయిపోయింది… అడిగేవాళ్లు లేక?

టీడీపీతో పొత్తు అధికారిక ప్రకటన అనంతరం పవన్ కల్యాణ్ వారాహి నాలుగో విడత యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా… కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు మరింత దారుణంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బట్ట కాల్చి ముఖం మీద వేయడం అలవాటుగా మారిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి.

అవును… బట్ట కాల్చి ప్రభుత్వం మీదకు విసిరేయటం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కు ఈమధ్యకాలంలో బాగా అలవాటైపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఆధారాలు అనే ప్రస్థావన లేకుండానే ప్రభుత్వంపైన, ప్రభుత్వంలోని వ్యవస్థలపైనా ఎంతటి ఆరోపణలు అయినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఏమైనా అడిగితే కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అంటారు.

ఇలా చేసిన ఆరోపణలపై ప్రభుత్వం నుండి ఏదైనా నోటీసు వస్తే దానికి సమాధానముండదు. ఈ క్రమంలో తాజాగా కృష్ణాజిల్లాలో వారాహి యాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… పెడన మీటింగ్‌ ను అడ్డుకునేందుకు పులివెందుల నుండి సుమారు రెండు వేల మంది రాళ్ళు, కర్రలు, కత్తులు పట్టుకుని నియోజకవర్గంలో రెడీగా ఉన్నారని తనకు సమాచారం వచ్చిందని ఆరోపణలు చేశారు.

దీంతో ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. అసలే మంత్రి, స్త్ఘానిక ఎమ్మెల్యే జోగి రమేష్‌ కు పవన్ అంటే అస్సలు పడదు. పవన్ పేరు చెబితే ఒంటికాలిపై అంతెత్తున లేచి మరీ మండిపడుతుంటారు జోగి రమేష్. అందుకనే పెడన మీటింగ్‌ ను అడ్డుకునేందుకు రౌడీలు రెడీగా ఉన్నారంటు పవన్ కల్యాణ్ ఆరోపించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు… ఈ ఆరోపణలకు ఆధారాలను, పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని నోటీసులు పంపించారు.

అయితే… ఆ నోటీసులు అందుకున్నప్పటినుంచీ పవన్ సైలంట్ అయిపోయారు. ఆ విషయంపై ఇక స్పందించలేదు. దీంతో… పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వనిపక్షంలో… కావాలనే ప్రభుత్వంపై బురదచల్లటానికే పవన్ ఆరోపణలు చేశారని అనుకోవాల్సుంటుందని జిల్లా ఎస్పీ జాషువా స్పష్టంగా ప్రకటించారు.

వారాహి తొలి విడత యాత్రలో కూడా పవన్ కల్యాణ్ ఇలాంటి కామెంట్లే చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా పర్యటనలో కూడా వందల మంది తనపై దాడి చేయటానికి రెడీగా ఉన్నట్లు ఆరోపించారు. వారాహి యాత్రలో పాల్గొంటున్న వాళ్ళలో కొంతమందిని చంపటానికి రౌడీ మూకలు ప్లాన్ చేసినట్లు తనకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో… అలాగే రాష్ట్రంలో 50 వేల మంది బడిపిల్లలు చనిపోయారని, 32 వేల మంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారని ఆరోపించారు. అలా హ్యూమన్ ట్రాఫికింగ్‌ కు వ‌లంటీర్లు కారణమని, వారంతా సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపారాని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. అప్పుడు కూడా మహిళా కమిషన్ నోటీసులిచ్చింది.

ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందనటానికి ఆధారాలను చూపమని నోటీసు ఇచ్చారు. అయితే ఆ నోటీసులపై పవన్ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జగన్ అంటే పవన్‌ కు ఏమాత్రం ఇష్టం ఉండదు అనే సంగతి తెలిసిందే. అయితే మాత్రం… ఇలా తనకు కొట్టించడానికి రౌడీలను దింపుతున్నారని, తనకు సమాచారం ఉందని చెప్పడం పవన్ కు ఫ్యాషన్ అయిపోయింది.

ఆరోపణలు మాత్రమే ఆయన పనిలా ఉంది.. అందుకు సంబంధించి గట్టిగా నిలదీస్తే మాత్రం కేంద్ర నిఘావర్గాల నుంచి తనకు సమాచారం ఉందని చెబుతుంటారు. ఆరోపణలు లేకపోతే… మోకాళ్ళపైన నిలబెడతా, పరిగెత్తించి పరెగెత్తించి కొడతా, నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతా అంటూ రెచ్చగొట్టే మాటలు సంస్కారం విడిచి మాట్లాడుతుంటారు.