పవన్ ఒక్క డైలాగ్… ఆడుకుంటున్న పాత మిత్రులు!

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఏ ముహూర్తాన్న మొదలుపెట్టారో తెలియదు కానీ… ఆ యాత్ర ప్రారంభమైనప్పటినుంచీ కొత్త కొత్త ఇబ్బందులే వస్తున్నాయి. ఆ యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న సభల్లో పవన్ ప్రసంగాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ఈ సందర్భంగా చేస్తొన్న విమర్శలు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. తాజాగా వైజాగ్ లోనూ అదేజరిగింది.

అవును… వారాహి యాత్ర మొదటిదశలో తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడపై పరోక్షంగా తప్పుడు వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. అనంతరం పవన్ పై ఫైరయ్యారు. ముద్రగడ రెండు సరైన లేఖలు రాసేటప్పటికి.. పవన్ పలాయనం చిత్తగించారు. మళ్లీ ముద్రగడ పేరెత్తలేదు! ఆయన ఫోటోలు కనిపించినా కంగారైపోయిన పరిస్థితి!

ఇదే సమయంలో వారాహి రెండో దశలో ఏలూరులో వాలంటీర్లపై అవాకులు చెవాకులూ పేల్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ నాలుక కరుచుకున్నారు.. వాలంటీర్లపై తనకు ద్వేషం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు.

ఇప్పుడు తాజాగా వారాహి యాత్ర 3.0లో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు పవన్. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక్కమాట… మిత్రులు – శతృవుల నుంచి కూడా తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. అవును… కేంద్రం అండతో జగన్ని ఒక ఆట ఆడిస్తాను అని పవన్ కల్యాణ్… స్కూలు పిల్లల డైలాగ్ ఒకటి చెప్పారు! దీంతో… వైసీపీ నేతలతో పాటు పవన్ పాత మిత్రులు సైతం వాయించి వదులుతున్నారు.

పవన్ వ్యాఖ్యలను పట్టుకుని వైసీపీ సెటైర్లు పేల్చుతోంది. మంత్రులు కూడా నీ పవర్ పలుకుబడి ఏంటో చూపించు పవన్ అని కవ్విస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా అయితే పవన్ ని ఏపీ రాజకీయాల్లో ఆటలో అరటిపండు అంటూ లైట్ తీసుకున్నారు. జగన్ పై చేస్తున్నవి అర్ధరహిత విమర్శలంటూ ఒక ఆటాడుకుంటున్నారు. మరో మంత్రి గుడివాడ అమరానాధ్ అయితే పవన్ కి అంత పలుకుబడి ఉంటే కనుక కేంద్రంతో చెప్పి ప్రత్యేక హోదా విభజన హామీల గురించి మాట్లాడి వాటిని సాధిచాలని రివర్స్ అటాక్ చేశారు.

అనంతరం తాజాగా వామపక్షాల వంతు వచ్చింది. పవన్ కు పాత మిత్రులు అయిన కమ్యునిస్టులు కూడా పవన్ ని టార్గెట్ చేశారు. ఇప్పటికే పవన్ బీజేపీతో కలవడంపై కాకమీదున్న కమ్యునిస్టులు… కేంద్రం వద్ద పవన్ కి అంత పలుకుబడి ఉంటే జగన్ తో ఆటాడుకోవడం కాదు, ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో కేంద్రం అండదండలు లేకపోతే జగన్ ఏపీలో ఇంత దూకుడుగా వెళ్ళరన్న సంగతిని పవన్ తెలుసుకోవాలని కమ్యునిస్టులు సూచిస్తున్నారు. మొత్తానికి పవన్ తనకు కేంద్రం పెద్దల వద్ద చనువు సాన్నిహిత్యం ఉంది అని చెప్పుకుంటే అధికార వైసీపీ యే కాదు విపక్షాలు సైతం పవన్ మీదనే తమ విమర్శల గురి పెడుతున్నారు. దీంతో… ఆ ఒక్క డైలాగ్ తో పవన్ అన్ని రకాలుగానూ వాయింపుకు బలవుతున్నారన్నమాట!