ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరబోతున్నట్లే కనిపిస్తుంది. మూడు పార్టీల అధ్యక్షులూ రెండు మూడు రోజుల వ్యవధిలో జనాల్లోకి వెళ్లబోతున్నారు. ఇందులో భాగంగా సోమవారం కుప్పంలో జరిగిన బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్రకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు.
ఈ సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కూడా ప్రారంభం కాబోతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా.. ఆయన బరిలో నిలుస్తున్న పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈ మేరకు షెడ్యూల్ సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు. దీంతో ఈ నెల 30 న వారాహి పిఠాపురం చేరనుంది!
అవును… ఎనికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 30 నుంచి పిఠాపురం కేంద్రంగా వారాహి యాత్ర మొదలుకాబోతోంది. ఈ విషయంలో పిఠాపురానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన పవన్… అక్కడ మూడు రోజులు గడిపిన అనంతరం రాష్ట్ర పర్యటనకు బయలుదేరతారు. దిఈంతో జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది!
ఇందులో భాగంగా ఈ నెల 30న నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించే పవన్… అదే రోజు శ్రీపద వల్లభుడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. నెక్స్ట్ డే 31న ఉప్పాడ సెంటర్ లో వారాహి యాత్ర ఉంటుంది. అక్కడ జరిగే బహిరంగ సభలో వారాహి వాహనం పై నుంచి పవన్ జనసేన తొలి ఎన్నికల ప్రసంగం చేయబోతున్నారు. అనంతరం ఏప్రిల్ 1 న పార్టీలో చేరికలు ఉంటాయి.
అనంతరం నియోజకవర్గంలో సమవేశం నిర్వహించనున్న పవన్ కల్యాణ్… ఈ మూడు రోజులూ పిఠాపురంలోనే బస చేస్తారు. ఇదే క్రమంలో… ప్రత్యేక పూజల తర్వాత బంగారుపాప దర్గా ను దర్శనం చేసుకుని, అనంతరం క్రైస్తవ పెద్దలతో సమావేశాల్లో పాల్గొంటారు. ఇలా సర్వమత ప్రార్థనల్లో పాల్గొనే పవన్… పిఠాపురంలోనే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.
మరోపక్క ఈనెల 27న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అదే రోజు చంద్రబాబు “ప్రజాగళం” యాత్ర కూడా మొదలుకాబోతోంది. ఆ తర్వాత మూడు రోజులకు పవన్ వారాహి యాత్ర కూడా మొదలుపెడతారన్నమాట. ఇలా మూడు పార్టీల అధ్యక్షులు వరుస యాత్రలు చేపట్టబోతుండటంతో.. ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరబోతోందని అంటున్నారు.