వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు… అప్పటికీ బాబు లోపలే!

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ములాకత్ లో భాగంగా కలిసిన అనంతరం… పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు పవన్ కల్యాణ్.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే… ఇదేమీ కొత్త విషయం కాదులే అంటూ వైసీపీ నేతలు కౌంటర్స్ వేశారు! అయితే ప్రస్తుతం చంద్రబాబు లోపల ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు? అనే విషయాలపై రాజకీయంగా చర్చ మొదలైంది.

చంద్రబాబు అరెస్ట్ అనంతరం పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కల్యాణ్… అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా మారిపోయింది పరిస్థితి. అయితే టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన ప్రకటనపై జనసైనికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ ఇప్పుడు ఇంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు… మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారని కొంతమంది వ్యాఖ్యానించారు.

ఇన్నాళ్లూ అనధికారికంగా ఉన్న పొత్తును అధికారికంగా కన్ ఫాం చేశారు అంతకుమించి ఇందులో బ్రేకింగ్ ఏమీ లేదంటూ అధికారపార్టీ నుంచి కామెంట్లు వినిపించాయి. ఆ సంగతి అలా ఉంటే… పవన్ వారాహి యాత్ర అప్ డేట్స్ నిలిచిపోవడంపై ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు జనసైనికుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ తెరపైకి వచ్చింది.

చంద్రబాబుకి బెయిల్ రాకుండా రిమాండ్ పొడిగిస్తున్న నేపథ్యంలో ఓవైపు నారా లోకేష్.. యువగళం పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయ యాత్రను నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా… నాలుగో విడత వారాహి విజయ యాత్రను పవన్ అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభించనున్నారు.

కృష్ణాజిల్లా అవనిగడ్డ నుండి వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా నేతలతో ఏర్పాట్లపై నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. అయితే టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రజల్లోకి రానుండటంతో… ఈ యాత్రపై ఫోకస్ పెరిగింది.

అయితే… ఈ సమయంలో వారాహి యాత్ర, అటు యువగళం యాత్రలు ప్రారంభమైతే.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఇష్యూ నుంచి కార్యకర్తలు సైడ్ అయిపోయే ప్రమాధం ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరోపక్క… చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కాబట్టి… ఆయన కోసం చూసేకంటే.. జనాల్లోకి వెళ్లడమే బెటరని పవన్, లోకేష్ లు ఆలోచించారని అంటున్నారు.

ఈసారి యాత్రలో జనసేన జెండాలతోపాటు, పసుపు జెండాలు కూడా దర్శనమివ్వబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే జనసైనికులు ఇంకా ఎంత కాలం రెండు జెండాలు మోయాలి అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… ఈసారి పూర్తిగా మోయాల్సిందే అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ యాత్ర ఎలాంటి రాజకీయ ప్రకంపణలు సృష్టించబోతుందనేది వేచి చూడాలి!