లెక్క మారింది… పవన్ వారాహిలో కొత్త మార్పులు!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… పవన్ కు ఒక పార్టీ అధినేతకు ఉండాల్సిన లక్షణాలు కానీ, ఆ తెగింపు కానీ, ఆ ధైర్యం కానీ, ఆ తరహా వ్యూహాలు కానీ ఉండవని చెబుతుంటారు చాలా మంది విశ్లేషకులు. పైగా.. వారు ఆ అభిప్రాయానికి ఎందుకు వచ్చిందీ సవివరంగా వివరిస్తుంటారు కూడా ఉదాహరణలతో సహా! ఈ నేపథ్యంలో పవన్ ప్రస్తుతానికి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే.. జనసేన అధినేత, కాబోయే సీఎం వంటి మాటలన్నీ తర్వాత అని అంటున్నారు.

అవును… ప్రస్తుతం పవన్ కల్యాణ్ తనను తాను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఎక్కువగా భావిస్తున్నారని.. ఒక పార్టీ అధినేత, 20 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్న పార్టీకి అధినేత.. 154 అసెంబ్లీ 23 లోక్ సభ స్థానలకు పోటీ చేస్తున్న రెండు పెద్ద పార్టీల పొత్తులో కీలక భూమిక పోషించిన రాజకీయ వ్యూహకర్త కూడా అనే విషయాన్ని మరిచిపోతున్నారని చెబుతున్నారు. దానికి తాజా ఉదాహరణ తెరపైకి తెస్తున్నారు.

సాధారణంగా వైఎస్ జగన్, చంద్రబాబు, లోకేష్ మొదలైన పార్టీ అధినేతలు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి వారి సొంత నియోజకవర్గాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ముందు రాష్ట్రంలోని కీలకమైన, పార్టీకి కష్టతరమైన నియోజకవర్గాల్లోని తమ తమ అభ్యర్థుల గెలుపుకోసం తమవంతు ప్రయత్నాలు చేయాలని భావిస్తుంటారు. తమ తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమా వారిలో ఉంటుంది. గతంలో లేకపోయినా లోకేష్ లో ఇప్పుడు ఆ ధీమా కనిపిస్తుందని చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం మారిన లేక్కల నేపథ్యంలోనో ఏమో కానీ చంద్రబాబు మాత్రం ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేనన్ని సార్లు కుప్పంలో పర్యటించారని చెబుతున్నారు. అందుకు గల కరాణాల సంగతి కాసేపు పక్కనపెడితే… పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పుడు మిగిలిన మొత్తం 174, జనసేన అభ్యర్థులు పోటీ చేసే మిగిలిన 20 స్థానలకంటే ముందు పిఠాపురానికే అధిక ప్రధాన్యం ఇస్తున్నారంట. ఇందులో భాగంగా వారాహి యాత్రలో భాగంగా పిఠాపురానికి పెద్దపీట వేస్తున్నారని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే… జనసేన క్యాడర్ తో పాటు ప్రజానికంలోనూ వారాహి యాత్రకు ప్రత్యేక అట్రాక్షన్ ఉంది. తొలిసారి వారాహి యాత్ర మొదలుపెట్టిన రోజుల్లో పవన్ తో పాటు ఆ వెహికల్ కి ఉన్న ఫాలోయింగే వేరు అన్నట్లుగా ఉండేది వ్యవహారం. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి పవన్ వారాహి వాహనాన్ని లైన్ లో పెడుతున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం నుంచి వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో పిఠాపురం శక్తిపీఠంలో పురుహూతిక దేవికి ముందుగా పూజలు నిర్వహించి, అనంతరం వారాహి ప్రచార రథంపైకి ఎక్కుతారు పవన్. ఈ సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పవన్ వాహనాన్ని తిప్పనున్నారంట! అవును… పిఠాపురంలో మొత్తం మూడు రోజులు పాటు పవన్ తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తుంది.

దీంతో… పవన్ కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు పిఠాపురం మీదే ఉందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పవన్ వారాహిపై ఎన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారో వేచి చూడాలని అంటున్నారు పరిశీలకులు మరియూ ప్రత్యర్థులు!