సీమవైపు పవన్ చూపు… టీడీపీలో కొత్త టెన్షన్!

పవన్ కళ్యాణ్ మూడు విడతలుగా చేపట్టిన వారాహి యాత్ర ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ వారాహి యాత్ర రెండు విడతల్లో సక్సెస్ ఫుల్ గానే సాగింది. ఆ యాత్ర వల్ల పార్టీకి వచ్చిన ప్రయోజనం ఎంతన్న సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీలో ఆందోళన కలిగించిన విషయమే ఎక్కువనే కామెంట్లు వినిపించాయి.

ఆ తరువాత ఆయన విశాఖ జిల్లాలో వారాహి యాత్రను నిర్వహించారు. ఈ సమయంలో నాలుగవ విడత వారాహి యాత్ర ఎపుడు.. ఎక్కడా.. అన్న చర్చ కొనసాగుతోంది. ఈ సమయంలో పవన్ నాలుగో విడత యాత్రపై ఒక ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… ఈసారి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రాయలసీమ జిల్లాల గుండా సాగుతుందని అంటున్నారు!

అవును… రాయలసీమలోని నాలుగు జిల్లాలలో పవన్ వారాహి రధాన్ని తిప్పుతారు అని తెలుస్తోంది. మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమ మీద పవన్ కన్ను పడింది అని అంటున్నారు జనసేన నేతలు. రాయలసీమలో బలిజ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉండటంతో.. వారిని టార్గెట్ చేస్తూ పవన్ వారాహి యాత్ర సాగుతుందని చెబుతున్నారు.

దీంతో టీడీపీ నేతలు కొత్త టెన్షన్ లో పడ్డారని చెబుతున్నారు. కారణం… రాయలసీమలో పవన్ వారాహి యాత్ర బలిజ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడానికే అంటున్నారు. అయితే, వీరంతా నిన్నటిదాకా టీడీపీ వైపు ఉంటూ వచ్చారు. దీంతో… పొత్తులు ఉంటే ఓకే కానీ… ఒక వేళ అలా కాదు అనుకుంటే మాత్రం టీడీపీకి పెద్ద నష్టమే అని అంటున్నారు.

పైగా రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉన్నా.. లేకున్నా.. ప్రతీ జిల్లాలోనూ కనీసం 3 సీట్లు గెలవాలని జనసేన అధినేత భావిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా… 13 ఉమ్మడి జిల్లాల్లోనూ మూడేసి సీట్లు అంటే… సుమారు 39 సీట్లన్నమాట! ఫలితంగా రేపు అసెంబ్లీలో కీ రోల్ పోషించొచ్చని భావిస్తున్నారంట.

ఈ లెక్కన చూస్తే… పొత్తు ఉంటే టీడీపీ అధినేత… ఒక్క జనసేన కోసమే సుమారు 40 సీట్లు త్యాగం చేయాలన్నమాట. ఈస్థాయి త్యాగం టీడీపీ గతంలో ఏనాడు చేసింది లేదు! దీంతో టీడీపీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! మరి చంద్రబాబు.. తన సొంత జిల్లాలో, తన ప్రాంతంలో వారాహికి అనుమతి ఇస్తారా.. లేదా అనేది వేచి చూడాలి!