జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ఆయన తుని నియోజకవర్గంలో తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు పవన్ మద్దతు పలకనున్నారు.
ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్ తుని చేరుకుంటారు. అక్కడి నుంచి దివీస్ పరిశ్రమ వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే ఆందోళన చేస్తున్న స్థానికులను, పోలీస్ లాఠీ ఛార్జ్ లో గాయపడ్డవారిని పవన్ పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఏపీలో దివీస్ లేబరేటరీస్ వ్యవహారం వివాదంగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.. దివీస్ ల్యాబ్‌ను నిలిపేస్తామన్న అధికార పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది.
ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని.. ఈసారి తూర్పుగోదావరి జిల్లాకు వెళుతున్నారు. కృష్ణా టూర్‌లో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను టార్గెట్ చేసిన పవన్.. ఈసారి కన్నబాబును టార్గెట్ చేస్తారనే చర్చ జరుగుతోంది.