ఇంకోసారి విశాఖలో ‘పవర్ షో’ కోసం జనసేన యత్నం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకోసారి విశాఖ వెల్లబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంగళగిరిలో వున్నారాయన. కొద్ది రోజులపాటు ఇక్కడే వుంటానని ఆయన ఇప్పటికే సంకేతాలు పంపారు. విశాఖపట్నంలో తలపెట్టిన జనవాణి కార్యక్రమానికి వైసీపీ అడ్డంకులు సృష్టించిందని ఆరోపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనవాణి కార్యక్రమం కోసం పార్టీ తరఫున హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

హైకోర్టు నుంచి అనుమతి వస్తే విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన అధినేత త్వరలో నిర్వహించే అవకాశం వుంది. నిజానికి, జనసేనాని పాల్గొనకపోయినా, జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనసేన పార్టీ పేర్కొంది. కానీ, జనసేనాని విశాఖ పర్యటనకు సంబంధించి చాలా ప్లానింగ్స్ ఆ పార్టీకి వున్నాయి. అవేవీ నెరవేరకుండా వైసీపీ సర్కారు, పవన్ కళ్యాణ్‌ని కేవలం ఆయన బస చేసిన హోటల్‌కి పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

సాధ్యమయ్యే పనేనా.? జనసేనానికి హైకోర్టు నుంచి అనుమతి లభిస్తుందా.? జనవాణి కార్యక్రమం కోసం మళ్ళీ జనసేనాని విశాఖ వెళ్ళగలరా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సెక్షన్ 30 యాక్ట్ విశాఖల్లో అమల్లో వుందనీ, సభలు.. సమావేశాలకు అనుమతి లేదనీ, జనసేన అధినేతకు ఇచ్చిన నోటీసులో విశాఖ పోలీసులు పేర్కొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

వైసీపీ నిర్వహించిన గర్జనకు అనుమతిచ్చి, పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడమేంటి.? అన్నది జనసేన ప్రశ్న. కానీ, విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర మంత్రులపై జరిగిన దాడి నేపథ్యంలోనే, పవన్ కళ్యాణ్‌ని హోటల్‌కి పోలీసులు పరిమితం చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.

వాస్తవానికి జనవాణి కార్యక్రమం కోసమే అయితే, విశాఖ పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మరి, హైకోర్టును జనసేన పార్టీ ఎందుకు ఆశ్రయిస్తున్నట్లు.?