పవన్ కళ్యాణ్ విశాఖ టూర్.! టీడీపీ ప్రస్తావనెందుకు వస్తోంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పయనమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీతో విశాఖలో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. ప్రధాని కార్యాలయం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక ఆహ్వానం లభించడంతో ఆయన విశాఖ పయనమైన సంగతి తెలిసిందే. హైద్రాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్ళారు పవన్ కళ్యాణ్. కాగా, బీజేపీ – జనసేన మధ్య స్నేహం మరింత బలపడేలా పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ముందు కొన్ని ప్రతిపాదనలు వుంచనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క బీజేపీ – జనసేన మధ్య గ్యాప్ నేపథ్యంలో ప్రధాని మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్‌ని చర్చలకు పిలిచినట్లుగా కూడా బీజేపీ, జనసేన వర్గాలు చెబుతుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, టీడీపీ – బీజేపీ పొత్తు కోసమే ప్రధానితో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారని అంటోంది వైసీపీ. ‘పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం కోసం కాదు.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ కళ్యాణ్ తాపత్రయం..’ అన్నది వైసీపీ ఆరోపణ. కానీ, వైసీపీ మైండ్ గేమ్‌ని జనసేన లైట్ తీసుకుంటోంది. ‘ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలేమీ లేవు. మిత్ర పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయంతే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. పోలీసు వ్యవస్థని అధికార పార్టీ అడ్డగోలుగా వాడేస్తోంది. ఈ విషయాల్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారు..’ అన్నది జనసేన వాదన.

ఎవరి వాదనలు ఎలా వున్న, చాలాకాలం తర్వాత నరేంద్ర మోడీ – పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతున్న దరిమిలా, ఇటు బీజేపీ.. అటు జనసేన.. ఇంకోపక్క టీడీపీ, వైసీపీ కూడా జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. పవన్ గనుక, రేపటి ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోలో పాల్గొంటే, రాజకీయ సమీకరణాలు ఏపీలో అనూహ్యంగా మారతాయన్నది నిర్వివాదాంశం.