చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.! పొత్తుల లెక్కలు తేలతాయా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవబోతున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దల సందేశాన్ని చంద్రబాబుకి చేరవేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

‘రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది’ అని జనసేన అధినేత చెప్పిన దరిమిలా, జనసేన – బీజేపీ కూటమినే ఎన్డీయే కూటమిగా జనసేన, బీజేపీ శ్రేణులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చాయి. రేపు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవనున్న దరిమిలా, ఎన్డీయే కూటమి అంటే, అందులో టీడీపీ కూడా వుంటుందని అనుకోవాలేమో.

టీడీపీతో కలవబోం.. అని బీజేపీ ఖరాఖండీగా చెబుతోంది. అయినా, పవన్ కళ్యాణ్ మాత్రం, జనసేన – బీజేపీతోపాటు టీడీపీని కూడా కలుపుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేతపై ‘బ్రోకర్’ అన్న విమర్శలు వస్తున్నాయి.

అంతలా తన మీద విమర్శలు వస్తున్నప్పుడు, చంద్రబాబుని కలిసే విషయమై పవన్ కళ్యాణ్ సంయమనం పాటించాలి కదా.? పోనీ, చంద్రబాబే తనను కలిసేలా చేసుకోవాలి కదా.? ఈ విషయమై జనసేన శ్రేణులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.. తమ అధినేతను సమర్థించుకోలేకపోతున్నాయి.

కాగా, పొత్తుల విషయమై రేపు పూర్తిస్థాయి స్పష్టత రాబోతోందనీ, పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలోనూ క్లారిటీ వస్తుందనీ టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేనకు 50 సీట్ల వరకూ ఇచ్చేందుకు టీడీపీ మానసికంగా సిద్ధమయిపోతోంది.! అంతేనా.? ఇంకేమైనా కారణాలతో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారా.?