ఏపీలో జనసేన – బీజేపీ ల మధ్య పొత్తు ఉందా అంటే? అటు ఏపీ బీజేపీ నేతలు కానీ, ఇటు జనసేన నేతలు కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే… ఈ విషయంలో వారి స్పష్టత అస్పష్టం. అయితే… జనసేనలోని ఒక వర్గం… ఒంటరిగా పోటీచేద్దామని సూచిస్తుంటే… మరొక వర్గం మాత్రం చంద్రబాబుతో జతకడితే సేఫ్ అని సూచిస్తున్న పరిస్థితి! ఈ సమయంలో బీజేపీకి జనసేన ప్లస్ అవుతుందే తప్ప… జనసేన కు బీజేపీ ఏమాత్రం ప్లస్ కాదనే అభిప్రాయం జనసేనలోని మెజారిటీ జనాల నమ్మకంగా ఉందని చెబుతున్నారు.
ఇక ఏపీ బీజేపీ నేతల విషయానికొస్తే… జనసేన తమకు మిత్రపక్షం అని, ఈ ఎన్నికల్లో జనసేన మద్దతు బీజేపీ అభ్యర్థికే అని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోము వీర్రాజు స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ.. ఫలితాల అనంతరం ఆ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ మాత్రం… జనసేనపై ఫైరయ్యారు. ఏపీలో బీజేపీ – జనసేన మధ్య సఖ్యత లేదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓటు బీజేపీకి పడలేదని.. అసలు జనసేనతో పొత్తు ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
మరోపక్క బీజేపీని వదిలించుకుందామని పవన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని… ఇప్పటివరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మద్దతు ఇవ్వకపోయినా వారికి అర్ధం కావడం లేదని.. వారిని వదిలించుకునే మార్గం కోసం పవన్ పరితపిస్తున్నారని.. జనసేనలోని ఒక వర్గం విచారిస్తుంది! ఇలాంటి పరిస్థితుల్లో… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లొచ్చిన వారం రోజుల్లోనే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లడం మరింత చర్చనీయాంశమైంది.
ఈ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మరికొంత మంది కీలక నాయకులు పవన్ కలువనున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించనున్నారని సమాచారం. ఏపీలో బీజేపీ జనసేకు మధ్య దూరం పెరుగుతుందన్న కామెంట్లు ఇరుపార్టీల నుంచీ వస్తున్న క్రమంలో ఈ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే… రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పవన్ తో చర్చించేందుకే హస్తినకు పిలిపించారని.. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు కొనసాగించాలని – ఆ ప్రభావం ఫలితాల్లో చూపించాలని.. బీజేపీ పెద్దలు పవన్ ని కోరే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. అయితే… బీజేపీ పెద్దల బుజ్జగింపులకు ఈ గబ్బర్ సింగ్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది!