పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేస్తారా.? నిజమేనా.?

‘జనసేన ప్రభుత్వం వచ్చి తీరుతుంది..’ అని గతంలో నినదించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో ‘జనసేన – టీడీపీ’ ప్రభుత్వం వస్తుందని సెలవిస్తున్నారు.!

ఇంతకీ, జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీట్లు ఎన్ని.? ఈ విషయమై జనసేన ముఖ్య నేతల వద్దనే స్పష్టత కొరవడుతోంది. సీట్ల పంపకాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ ఓ ఇంటర్వ్యూలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కూడా ఇదే మాట చెబుతున్నారు.

‘మన గౌరవం ఎక్కడా తగ్గకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం..’ అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వ్యాఖ్యానించారు. ఆ గౌరవ ప్రదమైన సీట్లు ఎన్ని.? అన్నదానిపై జనసేన వర్గాల్లో భిన్న వాదనలున్నాయి. టీడీపీ నుంచి మాత్రం అవమానకరమైన రీతిలో నెంబర్లు కనిపిస్తున్నాయి జనసేన వైపు.

ఇదిలా వుంటే, అసలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశమే లేదంటూ టీడీపీ నుంచి లీకులు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ని లోక్ సభకు పంపాలన్నది చంద్రబాబు ఆలోచన.. అలాగైతేనే, టీడీపీకి ముప్ప వుండదు.. అని చంద్రబాబు భావిస్తున్నారంటూ ఓ లీకు బయటకు వచ్చింది.

లేదూ, అసెంబ్లీకే పోటీ చేస్తానని జనసేనాని తెగేసి చెబితే, అసెంబ్లీతోపాటు లోక్ సభకూ పవన్ కళ్యాణ్ పోటీ చేసేలా చంద్రబాబు ఓ ప్రతిపాదన సిద్ధంగా వుంచుకున్నారట. అప్పుడైతే, అసెంబ్లీ కంటే, లోక్ సభకే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తారనీ, తద్వారా జాతీయ రాజకీయాల్లో బీజేపీతో పవన్ కళ్యాణ్ టచ్‌లో వుండటానికీ అవకాశం కుదురుతుందనే వాదన తెరపైకొస్తోంది.

నిజానికి, కాకినాడ లోక్ సభ – గాజువాక లేదా భీమవరం అసెంబ్లీ.. నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ గతంలో సమాలోచనలు చేశారు. విశాఖ ఎంపీ సీటు గురించీ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. చూద్దాం.. పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా వుండబోతోందో.. చంద్రబాబు వ్యూహం ఎలా వుండబోతోందో.!