అప్పుడే ఫైళ్ళపై సంతకాలట ? సిఎం అయిపోయినట్లేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో జనసేన వర్గాలే ఆశ్చర్యపోతున్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే సంతకాలు చేయబోయే మూడు ఫైళ్ళ గురించి చెప్పటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కృష్ణాజిల్లాలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ జరిగింది లేండి.  ఆ సభలో పవన్ మాట్లాడుతూ, తాను సిఎం కాగానే సంతకాలు చేసే మూడు అంశాల గురించి వివరించారు.

ఇంతకీ ఆ సంతకాలు ఏ ఫైళ్ళపైన అంటే మొదటిదేమో రైతులకు నెలకు రూ 5 వేల ఫించన్ పైనట. రెండో సంతకం, రేషన్ షాపుల ద్వారా సరుకులు తీసుకునే బదులు నెలకు రూ 2500 నుండి రూ. 3500 వరకూ డబ్బు ఇచ్చేస్తారట. రేషన్ షాపుల్లో నాసిరకం సరుకులు తీసుకునే బదులు బజారులో నాణ్యమైన సరుకులు కొనుక్కోవచ్చట. కాబట్టి ఈ ఫైలుపై రెండో సంతకం చేస్తానన్నారు.

ఇక మూడో ఫైల్ ఏమిటంటే, 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోయే ఫైలుపైన మూడో సంతకం చేస్తానన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం రూపుమాపేందుకు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తానంటున్నారు. పవన్ వరస చూస్తుంటే పోలింగ్ జరిగిపోయినట్లు, జనసేనకు మెజారిటీ వచ్చేసినట్లు, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు పవన్ కలలు కంటున్నారు.

అధికారంలోకి వస్తే తాను సంతకాలు చేయబోయే ఫైళ్ళివి అని జగన్ కూడా ప్రకటించారు. తాను సంతకాలు చేయబోయే ఫైళ్ళు ఇవి అని చెప్పుకోవటంలో తప్పేమీ లేదు. ఎప్పుడంటే 175 నియోజకవర్గాల్లో సిన్సియర్ గా పోటీ చేస్తుంటే. కానీ పవన్ పోటీచేస్తున్నది వైసిపి ఓట్లు చీల్చి చంద్రబాబును సిఎంగా చేయటానికే అని అందరికీ అర్ధమైపోతోంది. చంద్రబాబును సిఎంగా చేయటానికే పోటీ చేస్తున్న వ్యక్తి తానే సిఎం అయిపోతున్నట్లు బిల్డప్ ఇస్తుండటమే విచిత్రంగా ఉంది.