ఇంకో ఏడాదిలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. పార్టీ పరిస్థితి చూస్తే ఎక్కడేసిన గొంగలి అక్కడిలానే ఉంది. పార్టీ పెట్టి ఇంతాకాలం అయినా.. ఇప్పటికే ప్రత్యక్షంగా ఒక ఎన్నిక – పరోక్షంగా మరో ఎన్నిక ఫేస్ చేసినా.. ఇప్పుడు చౌరస్తాలో నిలబడిన పరిస్థితి! ఎందుకిలా? రాజ్యాధికారంపై ఎన్నో ఆశలుపెట్టుకున్న జనసైనికులు వ్యక్తపరుస్తున్న సందేహమిది! దానికి కారణం… స్పష్టత లోపించిన పవన్ పాలిటిక్స్ అనేది విశ్లేషకుల సమాధానం!
పవన్ ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవచ్చు.. మరెవరితోనైనా అంటకాగొచ్చు.. కానీ.. చేసే రాజకీయంపై కార్యకర్తలతోపాటు, ప్రజలకూ క్లారిటీ ఇస్తూ చేయాలి. అలాకాని పక్షంలో గతవైభవం పునరావృతం అయ్యే ప్రమాధం ఉంది! ఈ టాపిక్ ఇప్పుడు మళ్లీ రావడానికి కారణం.. “ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతు ఏ పార్టీకి” అనే విషయంపై పవన్ చూపించిన తెలివితేటలు!!
రాజకీయాలందు పవన్ రాజకీయాలు వేరయా… పొత్తులందు జనసేన పొత్తులు వేరయా… అనుకోవాల్సిన పరిస్థితి జనసైనికులది! బీజేపీతో పెళ్ళి అయినా – టీడీపీని పక్క చూపులు చూస్తున్న పవన్… తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తీసుకున్న స్టాండ్.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది! కొద్ది రోజుల క్రితం ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవ్, తిరుపతి ప్రెస్ మీట్ లో సోము వీర్రాజు.. జనసేన మద్దతు తనకు ఉందని ప్రకటించారు!
కానీ, జనసేన మాత్రం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో… ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఏపార్టీకి మద్దతు ఇస్తున్నది వెల్లడించకుండా.. “ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు.. జనసేన అభిమానులు, శ్రేణులు.. వైసీపీని ఓడించేలా వ్యవహరించాలి” అని చెప్పింది! పొత్తులో ఉన్నారు కాబట్టి… బీజేపీకి మద్దతు అని నేరుగా చెప్పొచ్చు… ఈ ఎన్నికల్లో పాల్గొనడం ఇష్టం లేకపోతే సైలంట్ గా ఉండొచ్చు! కానీ… వైసీపీని ఓడించాలని పిలుపునివ్వడం అంటే… పరోక్షంగా టీడీపీ వైపునకు తమ శ్రేణులను మళ్లిస్తున్నట్లేగా అన్నది విశ్లేషకుల అభిప్రాయం!
దీంతో… తన శ్రేణులతో, బీజేపీకి ఓటేయండని చెప్పడం ఇష్టం లేక అలా చెప్పారా..? అదీగాక, టీడీపీకి అనుకూలంగా ఓటేయండని బహిరంగంగా ప్రకటించే ధైర్యం లేక ఇలాంటి డొంకతిరుగుడు స్టేట్ మెంట్ ఇచ్చారా అన్నది పెద్ద డౌట్! ఇది తెలియాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందే!!