మొదలైన పవన్ కళ్యాణ్ ధర్మయాగం.. ప్రత్యేకతలివే!

ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈసారి ఎలాగైన గెలవాలని, గెలిచి నిలవాలని ఫిక్సయ్యారు. పైగా 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఒక పార్టీ మనుగడ పూర్తిగా ప్రశ్నార్ధం అవుతుందంటూ కథనాలొస్తున్న తరుణంలో అది జనసేన కాకూడదని పవన్ బలంగా నిర్ణయించుకున్నారు! ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో ధర్మ యాగాన్ని చేపట్టారు.

మరో రెండు రోజుల్లో ప్రారంభమవనున్న వారాహియాత్రకు ముందు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు. ఈ యాగం రెండురోజుల పాటు సాగనుంది. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలో యాగం ప్రారంభించారు. ఈ యాగాన్ని పవన్ స్వయంగా గణపతి పూజతో అంకురార్పణ చేశారు.

యాగశాలలో మొత్తం అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత “గణపతి”.. శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత “చండీ మాత”.. అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు “శివపార్వతులు”.. ఆయురారోగ్య ప్రదాత “సూర్య భగవానుడు”.. ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు “శ్రీ మహావిష్ణువు” ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది.