అనుకున్నంతా అయ్యింది. వారాహి యాత్ర తొలివిడత ముగింపు సభలో పవన్ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డీ అని సంబోదిస్తూ ఇక యుద్దమే అనే సంకేతాలు ఇచ్చారు. ఈ స్థాయిలో సాగిన పవన్ భీమవరం ప్రసంగంలో పవన్ పేల్చిన బాంబులు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం.
భీమవరం సభలో పవన్ కల్యాణ్ మునుపటికంటే మరింత ఆవేశంగా మాట్లాడారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు క్షణక్షణం తెలుసన్నారు పవన్. అయితే అవేంటనేది మాత్రం ఆయన చెప్పలేదు.
“నీకు బాగా దగ్గర మనిషిని నా దగ్గరకు పంపిస్తే నీ వ్యక్తిగత విషయాలు ఒక్కోటీ చెబుతాను. ఆ విన్న వ్యక్తికి చెవిలో నుంచి రక్తం కారకపోతే ఒట్టు” అంటూ పవన్ స్ట్రాంగ్ గా స్పందించారు. మాటిమాటిని నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా పవన్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చేశారు.
ఇదే సమయంలో చిన్న వయసులోనే తాత ప్రోద్బలంతో ఎస్.ఐ. ప్రకాశ్ బాబుని స్టేషన్ లో పెట్టి కొట్టిన ఘనత జగన్ ది అని చెప్పిన పవన్ కల్యాణ్… పోలీసు వ్యవస్థపై జగన్ కి గౌరవం లేదని అన్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించారని చెప్పుకొచ్చారు పవన్. గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చారని ఈ సందర్భంగా పవన్ ఎద్దేవా చేశారు.
అవన్నీ ఒకెత్తు అయితే… తనకు సంస్కారం ఉందని, తాను జగన్ లా వ్యక్తిగత విషయాలు మాట్లాడనని పవన్ చెప్పడం గమనార్హం. దీంతో కీబోర్డులకు పని చెబుతున్న నెటిజన్లు… చెప్పులు చూపించడం, పీక నొక్కి చంపేస్తానని అనడం, ప్రజా ప్రతినిధులను గుడ్డలు ఊడదీసి నడిరోడ్డుపై కొట్టుకెళ్తానని అంకుశం సినిమాలో రాజశేఖర్ డైలాగులు పేల్చడం ఏ సంస్కారంలోకి వస్తాదని అంటున్నారు.
సీబీఐ ఎంకవైరీలో ఉన్న కేసులను జగన్ కు ఆపాదిస్తూ.. బాబాయ్ ని చంపారని అనడం, సైకో అనడం, హత్యలు చేశారని చెప్పడం ఏ మార్కు సంస్కారమో పవన్ చెప్పాలని దుమ్మెత్తి పోస్తున్నారు. చీకటి రాజకీయాలు చేసే పవన్, చంద్రబాబు పంచన బ్రతికే పవన్ … జగన్ కి సంస్కారం గుర్తుచేయడం ఏమిటని ఎద్దేవా చేస్తున్నారు.
ఏది ఏమైనా… భీమవరం సభ అనంతరం వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయాలు ఒక రేంజ్ లో వేడెక్కబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే ఈ గ్యాప్ లో చంద్రబాబు స్థానం ఏమిటనేది ఆసక్తిగా మారింది. మరి ముఖ్యంగా మరి ఈరోజు నుంచి పవన్ పొలిటికల్ గా ఇదే ఫైర్ మెయింటైన్ చేస్తారా.. లేక, మళ్లీ గ్యాప్ తీసుకుని పార్ట్ టైం పొలిటీషియన్ అనే పేరును సార్ధకం చేసుకుంటారా అనేది వేచి చూడాలి.