టీడీపీతో పొత్తు సందర్భంగా కాస్త హుషారుగా కనిపిస్తున్న జన్సేన అధినేతకు ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రీజనల్ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ గుర్తుతో వైసీపీ, సైకిల్ గుర్తుతో టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ మాత్రం గతంలో పొందిన గాజు గ్లాస్ సింబల్ ను కోల్పోయింది.
పార్టీ స్థాపించి ఇప్పటికి పదేళ్లవుతున్నా పలు ఎన్నికల్లో పోటీ చేయడంలో జనసేన వెనకడుగు వేసింది. గెలుపోటముల సంగతి దేవుడెరుగు కనీసం పోటీకి కూడా నిలబడకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఇకపై గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేరిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా తమకు కేటాయించిన గుర్తును నిలుపుకోవాలంటే నిబంధనల ప్రకారం ఓట్ల శాతాన్ని తెచ్చుకోవాలి. అయితే జనసేన పార్టీ పలు ఉప ఎన్నికలకు దూరంగా ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా తక్కువచోట్ల పోటీ చేసింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇది జనసేనకు మామూలు దెబ్బకాదు. కారణం… ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది జనసేన. ఇక ఆ పార్టీ అధినేతకు బలమైన ఫ్లాట్ ఫాం గా ఉన్న సినిమాల్లో కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో గాజు గ్లాస్ ను ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ విధంగా గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్ గా ప్రజల్లో గుర్తింపు వచ్చింది.
అలాంటి సింబల్ ని ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు షాక్ తగినట్లయింది. దీనివల్ల జరిగే నష్టం చిన్నది కాదనేది విశ్లేషకుల మాటగా ఉంది! మరి ఇంత భారీ సమస్య నుంచి పవన్ ఎలా బయటపడతారు.. కొత్త సింబల్ ని ప్రజలకు ఎలా అలవాటు చేస్తారు అనేది వేచి చూడాలి!