జగ్గూ భాయ్… పవన్ శృతిమించుతున్నారా?

ఏదైనా పరిధిలో ఉంటే బాగుంటుంది.. పరిధి దాటి శృతిమించితేనే వెగటు పుడుతుంది.. ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ కల్యాణ్ అలాంటి శృతిమించిన ప్రసంగాలు, విచ్చలవిడిగా విమర్శలు చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

వారహి యాత్ర పేరు చెప్పి గోదావరి జిల్లాల్లో తిరుగుతున్న పవన్ కల్యాణ్… కులమతాల మధ్య చిచ్చు పెడుతూ, వ్యవస్థలపట్ల నోరు పారేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు విశ్లేషకులు. అందుకు బలం చేకూర్చేలా తాజాగా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అవును… సీఎం జగన్ ని ఏకవచనంతో సంబోధిస్తానంటూ వారాహి సభల్లో చెప్పిన పవన్ కల్యాణ్.. గురువారం తాడేపల్లి గూడెం నియోజకవర్గ జనసేన నేతల మీటింగ్ లో “జగ్గూభాయ్” అంటూ మరింత వెటకారంగా మాట్లాడారు! జగ్గూభాయ్ గ్యాంగ్ కి ఎవరో సలహా ఇచ్చారని.. ఆంధ్రప్రదేశ్ మనదే అనే భావన వారిలో ఉందని.. త్వరలోనే ఆ భావన తీసేస్తామని పవన్ వ్యాఖ్యానించారు.

జగన్ తన లాంటి విప్లవకారుడిని చూసి ఉండరని వ్యాఖ్యానించిన పవన్… పవన్ అంటే ఒకరు కాదని, విప్లవకారుల సమూహం అని చెప్పుకున్నారు. ఇదే సమయంలో మరింత పవర్ ఫుల్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ డైలాగ్ వెయ్యాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ… “నన్ను కొడితే కొట్టుకో, నా భార్యను అంటే అనుకో, నా బిడ్డల్ని చంపేస్తావా.. చంపేసుకో జగ్గూభాయ్” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలా తెగించకపోతే క్రిమినల్స్ సామ్రాజ్యాన్ని కూలగొట్టలేమని పవన్ చెప్పుకొచ్చారు.

అనంతరం… జనసేనను టీడీపీకి బీ టీమ్ అంటూ వైసీపీ వాళ్లు దాడి చేస్తున్నారని, దానికి ఎదురుదాడి చేయాల్సిందేనని జనసేన కార్యకర్తలకు సూచించిన పవన్… తాము ఎవరికీ బీటీమ్ కాదని, తనతో ఉన్నవాళ్లు ఆ విషయం నమ్మితే చాలని అన్నారు. ఇదే సమయంలో తాము బి టీమ్ కాదు, వైసీపీ వాళ్లదే మర్డర్ టీమ్ అని జనసేన నేతలు రియాక్ట్ కావాలని పవన్ సలహా ఇచ్చారు!

ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ని “జగ్గూబాయ్” అని సంభోదించడం.. మర్డర్స్ టీం అనడం.. తన పిల్లలకు చంపుకుంటే చంపుకో అని వ్యాఖ్యానించడం పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!