భీమవరంపైనే మొగ్గు చూపుతున్న జనసేనాని.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. టీడీపీ – జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటే, ఆ పొత్తుల క్రమంలోనే జనసేనాని పోటీ చేయబోయే సీటుపై ఓ స్పష్టత వస్తుంది.

‘పొత్తుల గురించీ, పోటీ చేసే స్థానాల గురించీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతారు.. పవన్ కళ్యాణ్ – చంద్రబాబు మధ్యన చర్చలు జరగాల్సి వుంది..’ అంటూ జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రం తెనాలి నుంచే పోటీ చేస్తానని అంటున్నారు నాదెండ్ల మనోహర్.

గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో జనసేన అధినేత పోటీ చేశారు.. 2019 ఎన్నికల్లో. రెండు చోట్లా ఓడిపోయారాయన. దాంతో, ఈసారి నియోజకవర్గాన్ని మార్చాలనీ, పిఠాపురం లేదా తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేయాలని ఆలోచిస్తున్నారనీ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, జనసేనాని మొగ్గు గాజువాక లేదా భీమవరం నియోజకవర్గాలపైనే వుందనీ, కొత్త నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించడంలేదనీ అంటున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భీమవరంలో పోటీ చేస్తే, ఈసారి సోలోగా అయినా సరే 50 వేల మెజార్టీ వస్తుందని జనసేన భావిస్తోందట.

టీడీపీ, వైసీపీ చేయిస్తున్న సర్వేల్లో కూడా జనసేనానికి భీమవరంలో ఈసారి విజయం తథ్యమని తేలుతోందిట.