గత కొంతకాలంగా ఏపీలో “ముందస్తు ఎన్నికల” వార్తలు తెగ చర్చల్లోకి వస్తున్నాయి. ఈ విషయాలను ముందుగా టీడీపీ నేతలు తెరపైకి తీసుకువచ్చారు. జగన్ హస్తిన వెళ్లింది ఈ విషయంపై మోడీతో మాట్లాడటానికే అంటూ ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలు వండి వడ్డించేసింది. ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ మరోసారి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో పవన్ పై ఆన్ లైన్ వేదికగా సెటైర్స్ పడుతున్నాయి.
స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఊహాగాణాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, ప్రజలు ఇచ్చిన సమయం మొత్తం పాలిస్తానని తెలిపారు. ఇదే సమయంలో ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని నేతలకు సూచించారు. ఆ తొమ్మిది నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రే ఇంత క్లారిటీగా చెప్పినా కూడా… పవన్ కల్యాణ్ తాజాగా ముందస్తు ఎన్నికలు ఉంటాయంటూ చెప్పుకొచ్చారు.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ చేసిన అనంతరం.. పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జంటనగరాల్లో సుమారు ఏడు నియోజకవర్గాలతో పాటు మొత్తం 26 సెగ్మెంట్లకు జనసేన ఇన్చార్జిల జాబితా విడుదల చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన… డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీతో పాటు ఏపీ లోనూ ఎన్నికలు జరుగుతాయని రెండూ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తాయని అన్నారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు. పవన్ కళ్యాణ్ జోస్యాలు చెప్పడం కూడా స్టార్ట్ చేశారా.. లేక, కేంద్ర ఎన్నికల సంఘం హోదాను తీసుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే పవన్ ముందస్తు మాటల వెనక ఒక భారీ ఆందోళన ఉందని అంటున్నారు పరిశీలకులు. రేపటి నుంచి ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర మొదలు కాబోతోంది. అయితే ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే పవన్ ఈ యాత్రను ఈనెలలోనే స్టార్ట్ చేశారు. లేదంటే.. మరింత సమయం షూటింగులు చేసి, ఆ పనులు పూర్తి చేసి ఉండేవారు! అయితే ఇది ముందస్తు కాలం కాదని, ఎన్నికలకు ఇంకా సమయం ఉందని జగన్ చెప్పడంతో జనాల్లో ఆ వేడి తగ్గింది.
ఇదే ప్రస్తుతం పవన్ భయం అని అంటున్నారు. ఎన్నికల సమయంలో జనాల్లో ఉండే వేడి, కేడర్ లో ఉండే ఉత్సాహం వేరుగా ఉంటాయి. నాయకులు చేపట్టే ప్రచార కార్యక్రమాలకు సైతం జనాలు అధికంగా రావడంతోపాటు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే… ఇప్పుడు గోదావరి జిల్లాలోతోపాటు మొత్తం ఏపీలో ఆ ఎన్నికల మూడ్ లేదు. దీంతో జనాల్లో ఆ మూడు తీసుకురావడానికి, జనసైనికుల్లో ఆ వేడి తీసుకురావడానికి పవన్ ఈ ప్రయత్నం చేశారని అంటున్నారు.
ఎందుకంటే… ఎన్నికల మూడ్ లేకపోతే పవన్ సభలకు సాదారణ ప్రజల కాన్సంట్రేషన్ అంతగా ఉండదు. ఫలితంగా అవన్నీ జనసైనికుల జనరల్ మీటింగ్స్ గానో, పవన్ కల్యాన్ సినిమాల ఆడియో ఫంక్షన్స్ గానో మిగిలిపోయే ప్రమాధం ఉంది. ఈ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టినందుకే పవన్ ఇలా ముందస్తు వ్యాఖ్యలు చేశారు. అంతే తప్ప… ముందస్తు ఎన్నికలు ఉండవని పవన్ కు మాత్రం తెలియదా?