టీడీపీని తొక్కేస్తున్న పవన్… వ్యూహాత్మకమా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా.. అందులో పరిపూర్ణమైన అస్పష్టత ఉంటుందని కొందరంటుంటే… సరిగ్గా అదే మాటకు పూర్తి వ్యతిరేకమైన మాట, రేపటి రోజున మాట్లాడతారని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. గతం సంగతి కాసేపు పక్కనపెడితే… వారాహి యాత్రలో ఆయన సోమవారం ఇచ్చిన స్టేట్ మెంట్లకు పూర్తి భిన్నంగా మంగళవారం చెప్పే మాటలు ఉంటాయని చెబుతుంటారు!

పవన్ కల్యాణ్ మాత్రం ఆ విమర్శలకు మరింత బలం చేకూరుస్తూనే ముందుకు పోతున్నారు! ఇందులో భాగంగా… వారహి యాత్రలో తాను సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్ననని ప్రకటించారు పవన్. దీంతో జనసైనికుల ఆనందానికి అవధులు లేవు! ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్నసంగతి కాసేపు పక్కనపెడితే… కనీసం పవన్ మదిలో ఆ ఆలోచన ఉందని సంబరపడ్డారు.

మరుసటి రోజే టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికలు పవన్ ను ఇంటర్వ్యూ చేశాయి. వెంటనే… అబ్బే అలా ఏమీ లేదు… సీఎం పోస్ట్ అంటే అదేమీ చిన్నది కాదు.. దానికి చాలా అనుభవం కావాలి అని చెప్పుకొచ్చారు. తన ఫ్యాన్స్ ఆనందం కోసం అలా చెప్పానే తప్ప.. తనకు అలాంటి ఆలోచన లేదని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదే క్రమంలో తాజాగా చేపడుతున్న నాలుగో విడత వారాహి యాత్రలో పెడన సభలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పిన పవన్ కల్యాణ్.. ముదినేపల్లికి వచ్చేసరికి మేము ఎన్డీయేకు దూరం అని ఎవరు చెప్పారని గర్జించారు. ఇది పవన్ మార్కు స్పష్టమైన రాజకీయం! నవ్విపోదురుగాక నాకేటి అనేస్థాయిలో పవన్ రాజకీయ ప్రకటనలు ఉంటుంటాయని అంటుంటారు.

ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో జగన్ కి సంక్షేమంలో ఫుల్ మార్కులు పడ్డాయనేది తెలిసిన విషయమే. కరోనా కష్టకాలంలో కూడా జగన్.. తన సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గలేదని చెబుతుంటారు. అయితే.. టీడీపీ నేతలు మాత్రం జగన్ ప్రభుత్వ సొమ్మంతా పప్పూ బెల్లాల్లా పంచిపెడుతున్నారని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అయితే ప్రజల మద్దతు, ఆసక్తి మాత్రం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలపై సానుకూలంగా ఉందని తేలడంతో తమ్ముళ్లు నాలుక కరుచుకున్నారు. టీడీపీ నేతలు సైతం… తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని మాట మార్చారు. నాలుకకు నరం ఉండదనే మాటను గుర్తుచేస్తున్నట్లుగా అన్నట్లు… రాజమండ్రి మహానాడులో మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.

ఆ మినీ మేనిఫెస్టోలో వైసీపీ పథకాలను, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పథకాలనూ ఎక్స్టెండ్ చేశారనే కామెంట్లు వినిపించాయి. ఆ స్థాయిలో టీడీపీ జాగ్రత్తలు తీసుకుని… ఆ పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదని డ్యామేజ్ కంట్రోల్ కార్యక్రమానికి తెరలేపింది. ఇంకెప్పుడూ జగన్ సంక్షేమ పథకాలపై నోరు మెదపకుండా ఉంది!

ఈ క్రమంలో తాజాగా మైకందుకున్న పవన్… జగన్ సంక్షేమ పథకాలతో జనాలను సోమర్లు చేస్తున్నారని, బద్దకస్తులను చేస్తున్నారని విమర్శించారు. దీంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు. ఇంతకాలం పవన్ ఏమి మాట్లాడినా అది జనసేన ఖాతాలో మాత్రమే పడేది కాబట్టి… టీడీపీ నేతలకు పెద్ద టెన్షన్ లేదు. అయితే ఇప్పుడు పొత్తు ప్రకటించిన తర్వాత.. వాటి ప్రభావం టీడీపీపై కూడా ఉంటుంది.

దీంతో… ఏదో చేస్తాడని పొత్తు పెట్టుకుంటే… ఉన్నది కూడా పోయేలా ఉందనే కామెంట్లు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్డీయే నుంచి వారికి చెప్పకుండానే బయటకు వచ్చారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ ని పవన్ విమర్శిస్తుండటం వల్ల కొన్ని వర్గాలకు టీడీపీని మరింత దూరం చేస్తున్నారని టెన్షన్ పడుతున్నారు.

తన యువగళం పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ విగ్రహం కనిపిస్తే… నారా లోకేష్ చేతులెత్తి దండం పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కూడా వైఎస్సార్ ని విమర్శించడం మానేశారు! ఈ నేపథ్యంలో పవన్ చేస్తున్న పాలిటిక్స్ వల్ల… గతంలో జనసేన ఫలితాలే రేపు కూటమికి వస్తాయేమోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… పవన్ టీడీపీ పాలిట వరమా, శాపమా అనేది పెద్ద ప్రశ్నా అనేది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది!