మోడీ పిలిచారట.. పవన్ కళ్యాణ్ వెళ్ళలేకపోతున్నారట.!

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వస్తే, ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా ఆహ్వానం అందినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ‘స్థానిక ఎంపీని పిలవకుండా నన్ను పిలవడం బాధించింది..’ అని ఇటీవల భీమవరం వెళ్ళిన సందర్భంలో జనసేనాని ‘కవరింగ్’ డైలాగ్ పేల్చారు.

తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఢిల్లీ నుంచి ఇంకో ఆహ్వానం అందింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ విరమణ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం ఢిల్లీ నుంచి వచ్చిందట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ, అనారోగ్య సమస్యలతో వెళ్ళలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

బీజేపీకి జనసేన మిత్రపక్షమే అయినా, ఎందుకో రెండు పార్టీల మధ్యా సఖ్యత కనిపించడంలేదు. కేంద్ర నాయకత్వంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించవు. ఎందుకిలా.?

ఏమోగానీ, పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నమాట వాస్తవమే గనుక, ఆయన ఢిల్లీకి వెళ్ళలేకపోవడం వెనుక బలమైన కారణమే వుంది ఈ సారి. అయితే, ఇంకోసారి ఇలాంటి అవకాశం పవన్ కళ్యాణ్‌కి వస్తుందా.? అన్నదే ఆలోచించాల్సిన విషయమిక్కడ.
అసలు, పవన్ కళ్యాణ్‌ని ఏ హోదాలో ఢిల్లీ పెద్దలు పిలిచి వుంటారు.? అనే చర్చ తెలుగు రాజకీయాల్లో జరుగుతోంది.