పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి జనసేనాని పవన్ కళ్యాణ్.!

వారాహి విజయ యాత్రకు సంబంధించి రెండో విడత రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

యాత్ర.. అంటే, పాదయాత్ర కావొచ్చు.. బస్సు యాత్ర కావొచ్చు.. జనంలో కొనసాగుతుంది.. ఇక్కడ, వారాహి విజయ యాత్ర కూడా జనంలోనే జరుగుతోంది. కానీ, ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో రోజు.. బహిరంగ సభలు మాత్రమే జరుగుతున్నాయి. దీన్ని ఏ తరహా యాత్ర అనాలో అర్థం కాని పరిస్థితి.

ఆ సంగతి పక్కన పెడితే, తన వైవాహిక జీవితం, విడాకుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణల్ని జనసేన అధినేత, రెండో దఫా వారాహి విజయ యాత్రలో తిప్పి కొట్టే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోపక్క, పూర్తిగా జనసేన అధినేత ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారంటూ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సినిమాలకు తక్కువ సమయం కేటాయించే అవకాశముంది.. పూర్తిగా రాజకీయాలపైనే జనసేనాని ఫోకస్ పెడుతున్నారన్నది జనసేన నేతల వాదన.

ఇంతకీ, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు సంగతేంటి.? బీజేపీతో జనసేన కలిసే వుందా.? రెండు పార్టీల మధ్యా గ్యాప్ పెరిగిందా.? ఈ అంశాలపై రెండో విడత వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత స్పష్టత ఇవ్వబోతున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నడుమ, వారాహి విజయ యాత్రను వేగవంతం చేయాలనే దిశగా జనసేన అధినేత వ్యూహం రచిస్తున్నారు. ఇంత నెమ్మదిగా యాత్ర జరిగితే, రాష్ట్రమంతా కవర్ చేయడం కష్టం. అందుకే, రెండో విడత వారాహి యాత్రలోనే, కీలకమైన నిర్ణయాలు జనసేనాని తీసుకోనున్నారట.