ఏపీలో ఎన్డీఏ సర్కార్ అంటున్న పవన్… దాని అర్ధం ఇదే?

ఢిల్లీలో జరిగిన ఎన్ డీఏ కూటమి సమావేశానికి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్టో ఏమో కానీ… హస్తిన నుంచి వచ్చిన అనంతరం.. ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల తరువాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అనడం మొదలుపెట్టారు. దీంతో… టీడీపీ పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును… ఎన్డీఏ కూటమి మీటింగ్ కి వెళ్ళి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల మీటింగులో మాట్లాడుతూ ఈ తరహా సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ఇదే సమయంలో ప్రజలంతా అఖండ మెజారిటీ ఇస్తే ముఖ్యమంత్రి అవుతాను అని ఆయన అంటున్నారు.

నిన్నమొన్నటివరకూ టీడీపీ నేతృత్వంలో జనసేన – బీజేపీ కలిసి ప్రయాణించాలని… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. నాడు పరోక్షంగా 2014 పొత్తులను ప్రస్థావించారు పవన్. ఫలితంగా… చంద్రబాబు నేతృత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని భావించారు.

అయితే బీజేపీ మిత్రపక్షాల మీటింగ్ కి మోడీ నుంచి చంద్రబాబుకు పిలుపురాకపోవడంతో పవన్ వాయిస్ మారిందని అంటున్నారు. హస్తినలో పవన్ కచ్చితంగా టీడీపీతో పొత్తు గురించిన చర్చ జరిపే ఉంటారని అంటునారు పరిశీలకులు. అయితే ఆ విషయంలో బీజేపీ పెద్దలెవరూ సానుకూలంగా స్పందించి ఉండకపోవచ్చని.. అందుకే ఇలా మాట మార్చారని అంటున్నారు.

ఇదే సమయంలో పవన్ చెప్పిన మాటల్లో మరో అర్ధాన్ని వివరిస్తున్నారట పరిశీలకులు. పవన్ చెప్పినట్లు ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అంటే… బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయి.. ఈ విషయంలో టీడీపీతో లోపాయకారి ఇప్పందం పెట్టుకుని… ఎన్నికలు అయ్యాక ముగ్గురూ కలిసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించి ఉండోచ్చు అంటున్నారు.

ఆ సమయంలో దాన్ని ఎన్డీయే ప్రభుత్వంగా ఏర్పాటు చేసి చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి… ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించేదీ బీజేపీ పెద్దలను అడిగి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే… ఈ విషయంలో పవన్ ఒక వాస్తవం మరిచిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు.

ఏపీలో బీజేపీ, జనసేనలకు ఉన్న బలానికి… టీడీపీ కి ఉన్న బలానికీ పొంతనలేదని చెబుతున్నారు పరిశీలకులు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పవన్ ఊహించుకుంటున్నట్లు ఎన్డీయే ప్రభుత్వం వచ్చే చాన్స్ లేదని చెబుతున్నారట. చంద్రబాబు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని… అప్పుడు ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ సహాయం తీసుకుంటే ఛాన్స్ ఉంటుందని అంటున్నారంట.

ఈ ఊహాగాణాల సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడితే… జనసేన బీజేపీతో పోటీ పడిన పరిస్థితి! ఈ ఐదేళ్లలో జనసేన బలపడిందెంత.. బీజేపీకి కొత్తగా ఏపీలో ఇన్ ఛార్జ్ లు మారడం మినహా జరిగిపోయిన మార్పెంత.. అని సవివరంగా వివరిస్తూ.. వాస్తవాల్లో జీవించమని చెబుతున్నారంట!