థానోస్ మంచోడా.? చెడ్డోడా.? మంచోడేగానీ, చేసే పనులు మాత్రం చెడ్డవి. ఏదో చెయ్యాలనుకుంటాడు, ఇంకోటేదో అవుతుంది. ఇంతకీ, ఈ థానోస్ కథ ఇప్పుడెందుకు.? అంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘థానోస్’ గురించి ప్రస్తావించారు గనుక. తనను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే ‘దత్త పుత్రుడు’ అంటోంటే, దానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చాలా పేర్లే పెట్టారు. సీబీఐ దత్త పుత్రుడు.. చంచల్ గూడా జైలు బ్యాచ్.. ఇంకేవేవో అనేశారు.
తాజాగా, ఆంధ్రా థానోస్.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొత్త పేరు పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి సోషల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇలా పవన్, ‘ఆంధ్రా థానోస్ జగన్..’ అని అన్నారో లేదో, ఆ వెంటనే, జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ షురూ చేసేశారు.
కానీ, వీటివల్ల జనసేన పార్టీకి రాజకీయంగా కలిగే ప్రయోజనమేంటి.? జనసేన అధినేతని దత్తపుత్రుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించడం వల్ల, వైఎస్ జగన్ స్థాయి తగ్గిపోయింది. ఇది బహిరంగ రహస్యం.! ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు తాను ఏం చేస్తున్నానో చెప్పుకోవాల్సింది పోయి, తన స్థాయిని తగ్గించుకుని, రాజకీయ ప్రత్యర్థుల మీద అసందర్భ ప్రస్తావనలెందుకు.?
మీడియాకి కంటెంట్ ఇవ్వడానికి మాత్రమే ఇవి పని చేస్తాయి తప్ప, జనానికి మాత్రం తప్పుడు సంకేతాలు వెళతాయ్. అది జగన్ అయినా, పవన్ అయినా, చంద్రబాబు అయినా.. ఇంకెవరైనా.! ఆయా పార్టీల మద్దతుదారుల్లో ఊపు తెచ్చే ఈ సెటైర్ల పట్ల ప్రజలకంటూ ఓ అవగాహన వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రా థానోస్.. అని వైఎస్ జగన్ మీద పవన్ విమర్శలు చేయడం వల్ల, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చే నష్టం వుండదు, పవన్ కళ్యాణ్‌కి అదనంగా కలిగే లాభమూ లేదు.!