ప్రభుత్వం అంటే పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నడిచే ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనే సంగతి రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు కూడా దాదాపుగా మరిచి పోయిన పరిస్థితి భారతదేశ రాజకీయాల్లో ఇప్పటికే ముదిరిపోయిన పరిస్థితి! ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సంగతైతే ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ అంటే… ఆ ఐదేళ్లు రాష్ట్రానికి రాజు, మహారాజు, నియంత అన్నస్థాయిలో పరిస్థితులు ఉంటున్నాయి.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు ప్రధానంగా వినిపించేవి. రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, ఇందిరమ్మ ఇళ్లు, మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం… ఎన్టీఆర్ పేరు, చంద్రన్న పేర్లు మాత్రమే వినిపించే పరిస్థితి. దాదాపు ప్రతీ పథకానికి ఎన్టీఆర్ పథకం.. లేదా, చంద్రన్న పథకం అనే పేర్లే వినిపించేవి.
అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం దివంగత వైఎస్సార్ పేరు మారుమ్రోగిపోయింది. మరోపక్క జగనన్న పేరు బలంగా వినిపించింది. ఈ పేర్ల విషయంలో ఆ పథకం, ఈ పథకం అనే తారమత్యాలేమీ లేవు. ఈ పేర్ల విషయంలో జగన్ ఏమాత్రం తగ్గలేదు! ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఇప్పటికే విజయవాడ మెడికల్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు తీసి ఎన్టీయార్ పేరు మార్పు కూడా జరిగిపోయింది.
ఆ సంగతి అలా ఉంటే… ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం కాదు.. కూటమి ప్రభుత్వం. ఇక్కడ టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ సీట్లు తెచ్చుకుని ఉండోచ్చు కానీ… ఈ రోజు కూటమి అధికారంలో ఉందంటే అందుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనేది టీడీపీ నేతలు సైతం ఆఫ్ ద రికార్డ్ అయినా ఒప్పుకుని తీరే పరిస్థితి. పవన్ కూటమిలో లేకపోతే 2019 ఫలితాలు రిపీట్ అయ్యి ఉండేవన్నా అతిశయోక్తి కాదేమో!
ఈ పరిస్థితుల్లో పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఆయనతో పాటు మరో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. 2014 – 19 మధ్యకాలంలో ప్రతీ పథకానికి చంద్రన్న, రామన్న అంటూ పేర్లు పెట్టినట్లు ఇప్పుడు కూడా చంద్రబాబు ఫాలో అవుతున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై అటు జనసేన, ఇటు బీజేపీ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని అంటున్నారు.
ప్రధానంగా ఈ విషయంలో పవన్ కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా గతంలోలాగా ప్రతీ పథకానికీ చంద్రన్న, రామన్న అంటే కుదరదనేది అటు జనసేన, ఇటు బీజేపీ ల నుంచి వినిపిస్తున్న మాటగా చెబుతున్నారు. కొన్ని పథకాలకు అయినా “పవనన్న” అనే పేరు పెట్టాలని జనసైనికులు గట్టివా వారిస్తున్నారని అంటున్నారు! ఈ విషయంలో బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోడీ పేరు తీయొద్దని గతానుభవాలను గుర్తుచేస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో… గతలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న, వైఎస్సార్ పేర్లపై పవన్ పలుమార్పు స్పందించారు! దేశంలో ఉన్న ఎంతోమంది ప్రముఖుల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని పవన్ అప్పట్లో సూచించారు. ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు ఆయా పార్టీల అధినాయకుల పేర్లు ఏమిటి అని గట్టిగా నిలదీశారు కూడా. అయితే ఆయన కీలక భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం… తిరిగి అదే రొట్టకొట్టుడు వ్యవహారం నడుస్తుందనే విషయంలో పవన్ కక్కలేక, మింగలేక ఇబ్బందిపడుతున్నారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి!
ఈ నేపథ్యంలో… ఈ విషయాన్ని చంద్రబాబే అర్థం చేసుకుని… పవన్ ఆలోచనా విధానాలకు కూడా అనుగుణంగా పాలన సాగించాలని.. పవన్ కు రెండు పదవులు, ఆఫీసుల్లో రెండు ఫోటోలూ పెట్టి మభ్యపెట్టడం కాకుండా… పవన్ కు ఉన్న విజన్ ని పరిగణలోకి తీసుకోవాలని.. ఆయన ఆలోచనా విధానానికి విలువ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారని తెలుస్తుంది. మరి పేర్ల విషయంలో పవన్ అభిప్రాయాలను బాబు గౌరవిస్తారా.. లేక, బోడిమల్లన్న సామెతను మళ్లీ గుర్తుచేస్తారా? అనేది వేచి చూడాలి!