గొడవలు పెంచే వాడు నాయకుడు కాదు… ఒప్పుకున్న పవన్!

వారాహియాత్రలో భాగంగా ప్రస్తుతం కోనసీమ జిల్లాలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంత మైలేజ్ తెచ్చుకున్నారో.. ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేశారో తెలియదు కానీ… కాపుల్లో మాత్రం చీలిక తీసుకొచ్చారనే చర్చ ఉభయగోదావరి జిల్లాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ సందర్భంగా… పవన్ చెప్పిన ఒక మాటను కూడా… రివర్స్ లో కొడుతున్నారు కాపు సమాజంలోకి ఒకవర్గం!

జనాలకు చెప్పుకోలేని పనిని, హడావిడిలో చేసిన తప్పుని… వ్యూహం అని సమర్థించుకుంటారు పవన్! ఇందులో భాగంగా తాయన చెప్పినన్ని మాటలు, ఆయన మార్చినన్ని మాటలు ఎవరూ మార్చిఉండరనే స్థాయి కామెంట్లను సంపాదించుకున్నారు. జనాల్లో చెప్పేదానికి మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పే దానికీ ఏమాత్రం పొంతనలేకుండా ఉండటం పవన్ ప్రత్యేకతల్లో ఒకటి అనే కామెంట్లు కూడా తదనుగుణంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో… తాజాగా కోనసీమలో మైకందుకున్న పవన్ కల్యాణ్… “గొడవలు పెంచే వాడు నాయకుడు కాదు.. గొడవలు తగ్గించే వాడు నాయకుడు” అని ఒక డైలాగ్ వేశారు. అది ఎవరు రాశారు అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… సభలో ఈ మాట అనంతరం హోరు జోరు పెరిగిపోయింది. దీంతో కౌంటర్ పార్ట్స్ ని సిద్ధంగా ఉంచుకున్న కాపుసమాజంలోని మరో వర్గం… ఆ డైలాగ్ పవన్ కు అచ్చుగుద్దినట్లు సరిపోద్దని చెబుతున్నారు.

తుని రైలు సంఘటన అనంతరం కాపు సామాజికవర్గానికి చెందిన ఎంతోమందిపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టింది. అయితే తాజాగా జగన్ సర్కార్ ఆ కేసులను ఎత్తివేసింది. గొడవలు వద్దు.. ప్రశాంత జీవితం జీవించండని సూచించింది. అయితే తాజాగా వారాహి యాత్ర మొదలుపెట్టిన పవన్… తోలు తీస్తా, బట్టలు తీస్తా, మెడలు వంచుతా, నార తీస్తా, రోడ్లపై కొట్టుకుంటూ తీసుకెళ్తా వంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే… కార్యకర్తల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే పనికి పూనుకుంటున్నారు. పరోక్షంగా గొడవలు పెరగడానికి దోహదపడుతున్నారు.

ఈ రెండు సంఘటనలు పరిగణలోకి తీసుకున్న విశ్లేషకులు… పవన్ నిజమే చెప్పారని.. పవన్ ఒప్పుకున్నారని అంటున్నారు. అదేలా అంటే… “గొడవలు పెంచే వాడు నాయకుడు కాదు..” అనే మాట పవన్ కు కరెక్ట్ గా వర్తిస్తుందనేది వారు చెప్పే మాట. ఇదే సమయంలో “గొడవలు తగ్గించే వాడు నాయకుడు” కాపు యువకులపై ఉన్న కేసులను ఎత్తేస్తూ.. ప్రశాంత జీవితంలోకి వారిని తీసుకెళ్లారు జగన్. దీంతో… పవన్ ఒప్పుకున్నారని, తాను నాయకుడిని కాదని అంగీకరించారని కామెంట్లు ఆన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి.

ఇదే సమయంలో కయ్యానికి కాలుదువ్వుతూ… కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం పై పరోక్షంగా అవాకులూ చెవాకులూ పేలితే… స్పందించిన ముద్రగడ ప్రత్యక్షంగా బహిరంగంగా ఒక లేఖ రాశారు. అయితే ఆ లేఖకు సమాధానం చెప్పలేని పవన్… గొడవలు పెంచేవిధంగా… జనసైనికులతో ముద్రగడను బూతులు తిట్టిస్తున్నారు! ఇది కూడా పవన్ చెప్పిన కొటేషన్ ప్రకారం… తాను నాయకుడు కాదని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు!