బీజేపీ – టీడీపీలను ఏకకాలంలో గిల్లిన పవన్!

ప్రస్తుతం వారాహి యత్ర చేపట్టిన పవన్ ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. తాను లేకుండా ఈసారి అసెంబ్లీ ఎలా ఏర్పాటు అవుతుందో చూస్తాను అంటూ జనసైనికులకు జోష్ కలిగించే డైలాగులు వేశారు. గతంలో ఓడించారు ఈసారి మాత్రం పక్కాగా అసెంబ్లీ గేటు తాకుతానంటూ మరో మాస్ డైలాగ్ వేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… సీఎం డైలాగ్స్ తోపాటు పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జనసేనాని.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే తనకు పదవులు ముఖ్యం కాదంటూ ఎవ్వరూ ఊహించని స్టేట్ మెంట్ ఇచ్చిన పవన్… తాజాగా సీఎం పదవి ఇస్తే తీసుకుంటా అని స్పందించారు. అయితే అది ప్రజలు ఇస్తేనా.. చంద్రబాబు ఇస్తేనా.. లేక, బీజేపీ బాబుని ఒప్పిస్తేనా అన్న సంగతి మాత్రం పవన్ స్పష్టం చేయలేదు. అయితే ఈ సమయంలో పొత్తులపై పవన్ కీలల వ్యాఖ్యలు చేశారు.

అవును… నిన్నమొన్నటివరకూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చను అని చెబుతూనే.. ఒంటరిగా వెళ్తే వీరమరణం అని ప్రకటించిన పవన్… తాజాగా పొత్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే సంకేతాలు ఇచ్చారు. అవును… కత్తిపూడి జంక్షన్లో మైకందుకున్న పవన్.. విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో అంటూ సస్పెన్స్ తో కూడిన డైలాగ్ పేల్చారు. ఇదే సమయంలో పొత్తులపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

దీంతో… చాలా మంది విశ్లేషిస్తున్నట్లు ఇది చంద్రబాబు వద్ద తన బలం నిరూపించుకుని నాలుగు ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారనే విషయంపై కాస్త స్పష్టత వస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఒకపక్క బీజేపీ పెద్దలు… జనసేనతో తమ పొత్తు ఉందని చెబుతున్నారు. మరో పక్క టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ పవన్ తో నే ఈసారి ప్రయాణం అని అంటున్నారు.

ఈ సమయంలో పవన్ మాత్రం ఒంటరిగా వస్తానో – పొత్తులో వస్తానో అంటు టీడీపీ, బీజేపీలను గిల్లే పనికి పూనుకున్నారు. అంటే… తాను అడిగినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో తాను ఈసారి ఒంటరిగానో, బీజేపీతోనే వెళ్తానని టీడీపీకి హెచ్చరిక జారీ చేసిన పవన్… తాను కోరుతున్నట్లు ముగ్గురం కలిసి వెళ్లకపోతే తన దారి తాను చూసుకుంటానని బీజేపీని కూడా అలర్ట్ చేశారన్నమాట.

మరి పవన్ అనుసరిస్తున్న ఈ వ్యూహాలు తెరవెనుక బాగానే ఉంటాయి కానీ… జనసైనికుల అభిప్రాయలు సైతం దానికి అనుగుణంగా మారాలని కోరుకోవడమే కాస్త కష్టంగా ఉండొచ్చని తెలుస్తుంది. కార్యకర్తల్లో ఈ కన్ ఫ్యూజన్ డ్రామాకు తెరలేపితే… ఆ కన్ ఫ్యూజన్ లో మరోసారి జగన్ కు గుద్దేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు!!