మూడో విడతలో ముఖ్యమంత్రి సీటు… పవన్ కీలక వ్యాఖ్యలు!

స్పష్టమైన అస్పష్ట రాజకీయాలు చేస్తారనే పేరు అనతికాలంలోనే సంపాదించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యత్ర మూడో దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశలు పూర్తి చేసుకున్న ఆయన… ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మూడో విడత వారాహి యాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి సీటు టాపిక్ ఎత్తారు.

అవును… వారాహి తొలివిడతలో భాగంగా సీఎం సీఎం అని అరుస్తున్న జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నానై.. ఇక జనం ఓట్లు వేయడమే ఆలస్యం అని తెలిపారు. దీంతో… పవన్ వారాహి యాత్రలో భాగంగా క్లారిటీ ఇచ్చారని అంతా భావించారు!

అనంతరం పవన్ మాట మార్చారు. రెండో దశ యాత్రకు ముందు ముఖ్యమంత్రి సీటుపై మడమ తిప్పారు, నాలుక మడతపెట్టారు! జనసైనికుల్ల తృప్తి కోసమే తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పినట్లు తెలిపారు. తనను అంత అనుభవం కానీ.. అవగాహన కానీ లేవన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీంతో జనసైనికుల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే కామెంట్లు వినిపించాయి. ఇదేమి మడత రాజకీయం అంటూ కొంతమంది జనసైనికులు ఆఫ్ ద రికార్డ్ ఫైరయ్యారు.

ఇప్పుడు తాజాగా వారాహి యాత్ర మూడో విడతలో ఉన్న పవన్… మరోసారి ముఖ్యమంత్రి సీటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్య‌మంత్రి సీటును తీసుకునేందుకు తాను సంసిద్ధంగానే ఉన్నాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తేల్చి చెప్పారు. ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని ఉంద‌ని.. ప‌దేళ్లుగా అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని ముందుకు సాగుతున్నాన‌ని అన్నారు. రెండు చోట్ల ఓడిపోయినా.. మాన‌సికంగా ఎక్క‌డా కుంగిపోలేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆదివారం రాత్రి నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడారు. ఏపీకి చెందిన‌ ఎంపీలు అంటే.. కేంద్రానికి చులకన అని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రం ఇక్క‌డి ఎంపీల‌ను, వారు చెప్పే విష‌యాల‌ను కూడా ఎవరూ ఖాతరు చేయడం లేదని అన్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నుంచి కాపాడే ప్ర‌య‌త్నం తాను చేసిన‌ట్టు చెప్పడం గమనార్హం.

అయితే వ్యూహాత్మకంగా ఆ నేరాన్ని కూడా వైసీపీపై వేసే ప్రయత్నం చేశారు పవన్. తాను కేంద్రంతో మాట్లాడుతుంటే… వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేయడం లేదని చెప్పడం గమనార్హం. పోనీ టీడీపీ ఎంపీలు ఎవరైనా సపోర్ట్ చేశారా అనే విషయంపై మాత్రం పవన్ ప్రస్థావించలేదు.