యెల్లో మీడియాలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూల వెనుక.!

వారాహి విజయ యాత్రకు టీడీపీ అనుకూల మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వడంలేదనీ, అసలు పట్టించుకోవడంలేదనీ.. జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాని బలంగా నమ్ముకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో జనసేన శ్రేణులు చాలా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. అయినాగానీ, ఓటర్లను బలంగా ఆకట్టుకోవాలంటే, మీడియా సపోర్ట్ అవసరం.

బహుశా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ అవసరాన్ని బలంగానే గుర్తించినట్లున్నారు. లేదంటే, పవన్ కళ్యాణ్ అవసరాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా గుర్తించినట్లుంది. బ్యాక్ టు బ్యాక్ టీడీపీ అనుకూల మీడియాకి.. అదేనండీ, యెల్లో మీడియాకి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు.

వాస్తవానికి గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వచ్చాయి. అయితే, ఈసారి కాస్త ప్రత్యేకం అంతే.! గతంతో పోల్చితే, పవన్ కళ్యాణ్ వ్యూహాలు చాలా చాలా పదునుగా కనిపిస్తున్నాయి. ‘నేనే ముఖ్యమంత్రిని..’ అంటారు, ‘ఏది ఏమైనా పొత్తులు ఖాయం’ అంటారు. ఇది టీడీపీకే కాదు, యెల్లో మీడియాకీ అర్థం కాకుండా పోయింది.

‘వ్యూహం నాయకు వదిలెయ్యండి..’ అంటూ పార్టీ శ్రేణులకు జనసేనాని ఎప్పుడో చెప్పేశారు. ఆయన వ్యూహాలైతే ఫలిస్తున్నట్టే.!