జనసేనాని పవన్ ఏం చేసినా తేడా కొట్టేస్తున్నాయ్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఏం మాట్లాడారు.? అన్నదానిపై జనసైనికుల్లో ఇప్పటికీ స్పష్టత లేదు. సభా ప్రాంగణానికి ఆలస్యంగా చేరుకున్న జనసేనాని కోసం జనసైనికులైతే చిత్తశుద్ధితో ఎదురు చూశారు. ఏ పార్టీకీ ఇలాంటి నిబద్ధత గల కార్యకర్తలు కనిపించరు ఈ రోజుల్లో.

కానీ, జనసేనాని పరిస్థితేంటి.? ‘ఈసారి బలిపీటమెక్కే పరిస్థితే వుండదు..’ అని జనసైనికులకు స్పష్టతనిచ్చారు జనసేనాని. అసలు బలిపీఠమెందుకు ఎక్కాలి.? అసెంబ్లీకి వెళ్ళి తీరతామన్నారు.. మంచిదే.! వైసీపీని ఓడిస్తామన్నారు.. అధికార పార్టీపై పోరాటమూ మంచిదే. టీడీపీతో పొత్తుపై చూచాయి వ్యాఖ్యలూ చేశారు.. అవీ రాజకీయాల్లో తప్పేమీ కాదు.

కానీ, గడచిన తొమ్మిదేళ్ళలో జనసేన రాజకీయంగా ఏం సాధించింది.? ఆరు లక్షలకు పైగా క్రియాశీలక కార్యకర్తలు.. అంటూ జనసేనాని సమాధానమిచ్చే ప్రయత్నమైతే చేశారు. కానీ, వంగవీటి రంగా ప్రస్తావన కావొచ్చు.. కుల, మత రాజకీయాల ప్రస్తావన కావొచ్చు.. ఇవన్నీ పార్టీని దెబ్బతీస్తాయని జనసేనాని ఎందుకు అనుకోవడంలేదు.?

కుల ప్రస్తావన లేని రాజకీయం కనిపించదు. కానీ, ఆ కుల ప్రస్తావన అనేది అంతర్లీనంగా మాత్రమే వుండాలి. అధినేత ఎప్పుడూ కులాల గురించీ, మతాల గురించీ.. ఎక్కువగా మాట్లాడకూడదు. అలా మాట్లాడటం ద్వారా తాను ‘విశ్వ నరుడ్ని’ అని జనసేనాని అనుకుంటారు. విశ్వనరుడి తత్వం సంగతేమోగానీ, ఇదొక రాజకీయ నరకం.. అని సాధారణ ఓటర్లు మరింత బలంగా జనసేన పార్టీని లైట్ తీసుకునే ప్రమాదం వుంది.