సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లో జనసేనాని.!

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు.. నిజానికి, తెలుగుదేశం పార్టీనే జనసేన పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తోంది..’ అనే వాదన చాలాకాలంగా వుంది. కానీ, జనసేన పార్టీ మాత్రం ‘గొర్రె, కసాయివాడ్ని నమ్మినట్లుగా’ టీడీపీని నమ్ముతోందన్న అభిప్రాయం కింది స్థాయిలో కొందరు జనసేన మద్దతుదారుల్లో వ్యక్తమవుతుంటుంది.

2014 ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి బేషరతుగా మద్దతిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని వల్ల జనసేన పార్టీకి ఒరిగిందేంటి.? అప్పట్లో ఆ రెండు రాజకీయ పార్టీలూ లాభపడ్డాయి. జనసేనకు మిగిలిందేంటి.? గుండు సున్నా.!

‘మా పార్టీలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు..’ అనే స్థాయికి జనసేన మిత్రపక్షం బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మేం జస్ట్ ఐటమ్‌లా చూస్తాం..’ అంటారో టీడీపీ నేత.! కానీ, జనసేన అధినేత మాత్రం, టీడీపీతో పొత్తు కోసం నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు.

‘వైసీపీని ఓడించే లక్ష్యంతో కాదు, మీరు గెలిచే లక్ష్యంతో ప్రయాణం చేయండి..’ అని మొదటి నుంచీ వైసీపీ, జనసేనకు సలహా ఇస్తూనే వుంది. నిజానికి, ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చెప్పదు. సరే, జనసేన పార్టీని వైసీపీ.. పురుగు కంటే హీనంగా చూస్తోందన్నది వేరే చర్చ.

2024లో ఎన్నికలు జరుగుతాయ్. ఏమో, ముందస్తు ఎన్నికలు వచ్చినా రావొచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై పవన్ కళ్యాణ్ కనిపించడంలేదు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి మరి.! ఈలోగా, టీడీపీ.. జనసేన పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తోంది.