మస్ట్ రీడ్: స్పష్టత కావాలి పవన్… సాధ్యమేనా?

ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర సాగుతుంది. సోమవారం నరసాపురంలో వారాహి బహిరంగ సభ బలంగా జరిగింది. ఈ సందర్భంగా మైకందుకున్న పవన్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. జగన్ ని ఇంటికి పంపాల్సిందే అని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ నిత్యం చెబుతున్న ఒక మాటను నిశితంగా పరిశీలిస్తూ వివరణ కోరుతున్నారు విశ్లేషకులు.

అవును… వారాహియాత్రలో భాగంగా ప్రచారానికి తెరలేపిన పవన్ కల్యాణ్… తాను పొత్తులోనే పోటీ అనే విషయాన్ని చెబుతూనే… మాటల మధ్యలో “జనసేన అధికారంలోకి వస్తే..” అని అంటున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ హామీ, ఈ హామీ అంటూ పక్కరాష్ట్రాల్లో ఫేమస్ అయిన కొన్ని హామీలను పేరు మార్చి ప్రకటించేపనికి పూనుకుంటున్నారు. ఈ సందర్భంగా… పవన్ కు కొన్ని సూచనలు చేస్తున్నారు విశ్లేషకులు.

పవన్ ఒంటరిగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? సమాధానం మిగిలినవారికంటే ఎక్కువగా పవన్ కే తెలుసు! ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే వీరమరణమే అనే స్పష్టత పవన్ కు పుష్కలంగా ఉంది. టీడీపీతోనే వెళ్లాలనే కృతనిశ్చయంతో పవన్ ఉన్నారు! మరి అలాంటప్పుడు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని ఎలా అనగలుగుతున్నారు. ఇది ఆల్ మోస్ట్ అసాధ్యం!

అంటే… ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే… జనసేనకు సింగిల్ గా మేండేట్ ఇవ్వలేదు కాబట్టి ఆ హామీలను నెరవేర్చలేము అని అంటారా.. లేకపోతే, చంద్రబాబు ఒప్పుకోవడం లేదని చెప్పి తప్పుకుంటారా అన్నది కూడా ఇక్కడ కీలకంగా ఉంది. కారణం.. చాలామంది రాజకీయ నాయకులకు ఇలా తప్పించుకు తిరగడం, ఏరు దాటి తెప్ప తేలేయడం అత్యంత సర్వసాధారణమైన విషయం.

అయితే పవన్ తన చిత్తశుద్దిని, ఇచ్చే వాగ్దానాల పట్ల కమిట్మెంట్ ను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఒంటరిగా పోటీచేస్తుంది.. సింగిల్ గా మేండేట్ ఇస్తే అన్ని హామీలూ నెరవేరుస్తామని చెప్పాలి. అలాకానిపక్షంలో… జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా అధికారంలోకి వచ్చినా సరే.. ఇవన్నీ నెరవేరుస్తాం అని అనైనా స్పష్టత ఇవ్వాలి.

ఇదే సమయంలో తాము ఇస్తున్న హామీలకు టీడీపీ ఒప్పుకుంటేనే వారికి మద్దతు లేక పొత్తు ఉంటుందని పవన్ ముందే ప్రకటించాలి. ఇలాంటి స్పష్టత ప్రజలకు ఇవ్వనంతకాలం… జనసేన ప్రభుత్వం వస్తే అనే మాట ఒక కామెడీ డైలాగ్ అయిపోద్ది తప్ప.. ప్రజలు సీరియస్ గా తీసుకునే ఛాన్స్ ఉండదు. పవన్ ఈ విషయాన్ని గ్రహించి స్పష్టత ఇవ్వాలి.. లేదా, ప్రజలను కావాలనే వంచిస్తున్నారనే స్పష్టతకు ప్రజలు వచ్చే ప్రమాధం ఉంది!