జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచీ సినిమాల్లో ఉండటం వల్ల… పైగా అన్నీ హీరోపాత్రలే చేయడం వల్ల తనను తాన్ను ఎక్కువ ఊహించుకుంటారని అంటుంటారు పరిశీలకులు. షూటింగ్ ల దగ్గర క్యార్ వేనూ, పక్కన బందోబస్తు, తల దువ్వే వాడొకడు, చొక్కా బత్తాములు పెట్టే వాడొకడు, ముఖానికి పౌడర్ పూసేవాడొకడు ఉండటం వల్ల తాను అంతకుమించి అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని చెబుతుంటారు.
ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చారు పవన్. వారాహి అని ఒక వాహనం వేసుకుని.. ఆ వాహనంపై తాను మాత్రమే ఉంటూ.. స్థానిక నేతలెవరికీ దానిపై చోటు లేకుండా హీరో ఇజం చూపించే ప్రయత్నం చేస్తుంటారని.. అంతా తానే.. అన్నీ తానే.. అనే భవనలో పవన్ ఉంటారని చెబుతుంటారు. అయితే సినిమా వేరు, రాజకీయం వేరు అని పవన్ కి తెలిసేపాటికి చాలా జరిగిపోతాయని అంటుంటారు పరిశీలకులు.
ఈ సమయంలో పవన్ కు ఉన్నఫలంగా హస్తిన నుంచి కబురొచ్చింది. ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వాముల కీలక సమావేశానికి హాజరుకావాలని ఫోనొచ్చింది. పైగా చంద్రబాబుని కాదని.. పవన్ ను బీజేపీ పిలవడంతో పవన్ చాతి కాస్త పైకి వచ్చిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తనను తాను ఎక్కువ ఊహించుకుంటూ పవన్ హస్తినకు చేరారని అంటున్నారు.
ఈ సందర్భంగా మైకులముందుకు వచ్చిన పవన్… ఏపీ రాజకీయాలు, పొత్తులు, ఎన్డీయే విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళటం, ఏపీ, తెలంగాణ భవిష్యత్తు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు చెప్పారు. దీంతో పవన్ కు ఇలాంటి మీటింగులకు వెళ్లడం ఫస్ట్ టైం కాబట్టి… చాలా ఊహించుకుంటున్నట్లున్నారు.. లోపల అలాంటి సీన్ ఏమీ ఉండదు… సమావేశం మొత్తం బీజేపీ వన్ సైడ్ బ్యాటింగే ఉంటుందని చెబుతున్నారంట.
అవును… ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను జనాల్లోకి తీసుకెళ్ళటం మినహా ఇంకే విషయమై చర్చకు వచ్చే అవకాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పరిస్థితి గురించిన చర్చ… రాబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటనేది బీజేపీ చెబుతుంటే… మిగిలిన పక్షాలు వినడమే ఉంటుంది.
పాపం ఆ విషయం తెలియని పవన్… ఈ భేటీకి తనను మాత్రం పిలిచారని ఫీలవుతూ… ఏపీ, తెలంగాణ భవిష్యత్తు గురించి చర్చిస్తానని చెప్పుకుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో… పవన్ కి మరో విషయం గుర్తుచేస్తున్నారంట పరిశీలకులు. మోడీ తనకు బాగా సన్నిహితుడని పవన్ చెప్పుకుంటే సరిపోదు. పవన్ తనకు సన్నిహితుడని మోడీ అనుకున్నప్పుడే అన్ని కుదురుతాయని అంటున్నారంట.
మరి పవన్ ఆ దిశగా ఆలోచించి మోడీ అపాయింట్ మెంట్ తీసుకుని ప్రత్యేకంగా భేటీ అవ్వగలుగుతారా… లేక, ఉత్తమ విద్యార్థిలా ఆ సమావేశంలో నేతలు మాట్లాడింది అంతా విని, తేనేటి విందు స్వీకరించి సక్కగా వెనక్కి వచ్చేస్తారా అన్నది వేచి చూడాలి.
అయితే చంద్రబాబుకు ఈ సమావేశానికి పిలుపు రాకపోయినా… అక్కడ ఏమి జరిగిందనే మొత్తం విషయం పూసగుచ్చినట్లు మనోహర్ చెబుతారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం!