ప్రజాస్వామ్యంలో దాడులకు చోటుండకూడదు. దురదృష్టమేంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దాడి అనేది సర్వసాధారణమైపోయింది. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వైరం మాత్రమే వుండాల్సింది పోయి.. వ్యక్తిగత వైరం స్థాయికి వెళ్ళిపోయింది. బూతులు తిట్టుకుంటున్నారు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
తాము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకొచ్చామన్న సోయ రాజకీయ నాయకులకు వుండటంలేదు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా.? అన్న చందాన, రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారో.. వారి అభిమానులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు.
విశాఖపట్నంలో పెద్ద రగడ చోటు చేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘గర్జన’ నిర్వహించింది. ఇదే రోజున జనసేనాని విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యారు.
ఈ క్రమంలో వైసీపీ – జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రులు, జనసేన మీద రాజకీయ విమర్శలు చేయడం మామూలే. వ్యక్తిగత విమర్శలతో మంత్రులు, జనసైనికుల్ని రెచ్చగొట్టారు.
ఫలితంగా సాయంత్రం మంత్రులపై దాడి జరిగింది. ‘ఇదేం పద్ధతి.?’ అంటూ మంత్రులు మండిపడ్డారు. మంత్రులెవరికీ గాయాలు కాలేదుగానీ, ఓ కార్యకర్తకు మాత్రం గాయమైందట. మంత్రుల వాహనాలు ధ్వంసమయినట్లు తెలుస్తోంది. ఇంతకీ, పోలీసులు ఏం చేస్తున్నట్లు.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.
‘ఎవడ్నీ వదిలిపెట్టం..’ అంటూ మంత్రి రోజా, జనసేన పార్టీకి చెందిన కార్యకర్తల్ని హెచ్చరించారు.. దాడి ఘటన తర్వాత. ఆమెపై హెల్మెట్‌తో దాడి చేసినట్లుగా మీడియాలో కథనాలొచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్,
తమ పార్టీ కార్యకర్తలు కావొచ్చు, అభిమానులు కావొచ్చు.. వారిని అదుపులో పెట్టుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి.. అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ ‘మేం తలచుకుంటే పవన్ కళ్యాణ్ బయట ఎక్కడా తిరగలేడు..’ అని మంత్రి జోగి రమేష్ హెచ్చరించేశారు.. ఈ వివాదం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఏమో.!