మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తోన్న జనసేనాని పవన్ కళ్యాణ్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనలో ఏదో పవర్ వుంటుంది. ఆ పవర్ చూసి ఆయన వెంట నడిచే లక్షలాదిమంది, కోట్లాదిమంది అభిమానులున్నారు. మరి, అంతమంది అభిమానులున్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు కనీసం ఎమ్మెల్యే అయినా అవలేకపోయారు.?

సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కి ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే, అన్నయ్య చిరంజీవిని చూశాక అయినా అర్థమయి వుండాల్సింది. కొత్త రాజకీయ పార్టీ పెట్టాక కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలు మారలేదు. ఆయన రాజకీయ చాతుర్యమూ కనిపించడంలేదు.

2014 ఎన్నికల్లోనే జనసేనాని పోటీ చేసి వుండాల్సింది. పోటీ చేసి వుంటే, ఖచ్చితంగా ఆయన చట్ట సభలకు వెళ్ళి వుండేవారే. ఆ అనుభవంతో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ మరింత పుంజుకునేది. రాజకీయాల్లో రాజకీయమే చేయాలి. ‘అబ్బే, నాకు అధికారం మీద మోజు లేదు..’ అని పదే పదే జనసేనాని చెబితే నమ్మేదెవరు.? నమ్మాల్సినోళ్ళు నమ్మడంలేదు సరికదా, కొందరైతే వెటకారం కూడా చేస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పదవులే తన వద్దకు రావాలంటున్నారు. ఇదెక్కడి చోద్యం. పదవుల వెంట పరుగులు పెట్టాలి. ఆ పదవి కోసం ఏం చేయాలో అదంతా చేయాలి. అలాగని అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. కానీ, జనంతో మమేకమై వుండాలి కదా.? రాజకీయ ఎత్తుగడలంటూ వుండాలి కదా.?

జనసేన శ్రేణులు సైతం తమ అధినేత వ్యూహాలు అర్థం కాక బిక్కచచ్చిపోతున్నారు. ‘పొత్తులు, రాజకీయ ఎత్తుగడల గురించి నాకు వదిలెయ్యండి.. మీరు మాత్రం జనంతో మమేకమయి వుండండి..’ అంటూ జనసేనాని చెబుతోంటే, ఆయన భావజాలమేంటో అర్థం కావడంలేదు జనసైనికులకి.
మళ్ళీ తప్ప, మళ్ళీ మళ్ళీ అదే తప్పు.. ఇదే జనసేన పార్టీని నిండా ముంచేస్తోంది. జనసేనానికి వేరే శతృవు అవసరం లేదంతే.