ఏపీలో 2024 నాటికి బలమైన శక్తిగా ఎదగాలనే ఉద్దేశ్యంతో జనసేన, భారతీయ జనతా పార్టీలు చేతులు కలిపాయి. ఎవ్వరితోనూ కలిసేది లేదని అంటూ వచ్చిన పవన్ రాష్ట్రంలోని రాజకీయ శక్తులను తట్టుకొని నిలబడాలంటే వెనుక బలం అవసరమని భావించి బీజేపీ పొత్తుకు అంగీకారం తెలిపారు. బీజేపీ సైతం స్థానికంగా ప్రజాకర్షణ కలిగిన నేత లేకుంటే ఉనికి కష్టమని భావించి ఏరి కోరి పవన్ జట్టు కట్టింది. ఇలా పరస్పర ప్రయోజనాల కోసం చేయి చేయి కలిపిన రెండు పార్టీలు అదే పరస్పర సహకారంతో ముందుకెళ్లాలి. కానీ జనసేన, బీజేపీల మధ్యన ఆ సహకారమే లోపించింది. రెండు పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.
స్వతహాగానే పవన్ ఒకింత ముభావి. ఎంత పొత్తున్నా అదే పనిగా రాసుకుపూసుకుని తిరగడు. సంయుక్త ఎజెండా ఉన్నా తన దృక్పథ కోణం నుండే నడుచుకునే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తితో స్నేహమంటే అవతలివారు ఎప్పుడూ అలర్ట్ అన్నట్టే ఉండాలి. చేసుకున్న ఒప్పందాల్లో తేడాలు రాకుండా చూసుకోవాలి. సొంత ప్రయోజనాలను పక్కనబెట్టి పొత్తు ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బీజేపీ వాటినే విస్మరించింది. పొత్తులో ఉన్నప్పటికీ అంతా తమదే అన్నట్టు వ్యవహరిస్తోంది. అక్కడే తేడా కొట్టి ఇరు పార్టీల మధ్యన దూరం పెరగడం మొదలైంది.
అసలే అమరావతి విషయంలో పవన్, బీజేపీలకు బోలెడంత అగాథం ఏర్పడింది. పవన్ ఏమో తాను అమరావతికే కట్టుబడి ఉన్నామని, రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని అంటున్నారు. కోర్టు రాజధాని తరలింపు విషయమై కౌంటర్ ఫైల్ దాఖలు చేయమనగా రైతులకు అనుకూలంగా చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ బీజేపీ మాత్రం అమరావతికి కట్టుబడి ఉన్నాం కానీ రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేమని అనేసింది. అంటే అమరావతి కోసం పవన్ పోరాడితే వెనుక బీజేపీ ఉండదు. ఇక్కడే పవన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ ఒక్క విషయంలోనే కాదు.. బీజేపీ తాను తీసుకుంటున్న కీలక నిర్ణయాలను పవన్ జోక్యం లేకుండానే తీసుకుంటోంది. సోము వీర్రాజుగారు ఎక్కడా పవన్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడటం లేదు. అందుకే పవన్ కూడ బీజేపీ గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పనేదో తాను చూసుకుంటున్నారట. ఇదే పద్దతిలో రెండు పార్టీలు వెళితే పొత్తు బెడిసికొట్టి పోట్లాట మొదలుకావడం ఖాయం.