ముసుగులో గుద్దులాటకి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్.?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. వైసీపీకి వ్యతిరేకంగా కలిసి పని చేద్దామా.? మీకేమైనా వేరే ఆలోచనలున్నాయా.?’ ఇదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలకు తేల్చి చెప్పిన విషయమట. అలాగని జనసేన పార్టీ చెప్పుకుంటోంది. ‘మా విధానం వైసీపీ ముక్త్ ఏపీ.. బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోంది. సంస్థాగతంగా ఏపీలో ఇంకా బీజేపీ బలోపేతమవ్వాలి. మా విషయం మేం చేసుకుంటాం..’ అని జనసేనాని వ్యాఖ్యానించడం మరో ఆసక్తికరమైన అంశం.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే, తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన, బీజేపీ పని చేయాలి. కానీ, ఆ పరిస్థితి వుందా.? బీజేపీ అందుకు సానుకూలంగా వుందా.? ఈ విషయమై చాలా గందరగోళం వుంది. ఆ విషయంలో స్పష్టత కోసమే జనసేనాని ఢిల్లీకి వెళ్ళినట్టుంది. ‘పొత్తులపై స్పష్టత మీరు కోరుకున్నప్పుడు కాదు, మేం చెప్పాలనుకున్నప్పుడు చెబుతాం..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలూ కొంత అయోమయానికి కారణమయ్యాయి. బీజేపీ – జనసేన పొత్తులోనే వున్నాయ్. ఇందులో కొత్తగా స్పష్టతనిచ్చేదేముంది.?

జనసేనాని రోడ్ మ్యాప్ అడుగుతున్నది, వైసీపీ ముక్త్ ఏపీ విషయంలోనేనని ఇంకోసారి స్పష్టమైపోయింది. మరి, బీజేపీ జాతీయ నాయకత్వం ఈ విషయమై అధికారికంగా ఎలా స్పందిస్తుందో ఏమో.!