హస్తినలో పవన్ హాట్ స్టేట్మెంట్… మనసంతా అక్కడే?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్… ముఖ్యమంత్రి పదవి, పొత్తుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా… తనను సీఎం గా జనసైనికులు చూడాలని అనుకుంటున్నారు అంటూ హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు!

అవును… ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గోడానికి ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్… మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… ముందు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. అదే ఏపీలోని విపక్షాల అజెండా అని అన్నారు. అనంతరం తనను సీఎంగా చూడాలని జనసైనికులు అనుకుంటున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ విషయాన్ని అయినా వీలైనంత అస్పష్టంగా చెప్పడంలో పవన్ దిట్ట అనే వ్యాఖ్యలకు బలం చేకూర్చే పనికి పూనుకున్నారు పవన్. ఇందులో భాగంగా… ముందు వైసీపీని గద్దె దిగనివ్వండి అని అంటూ సీఎం పదవి అన్నది ముఖ్యం కాదు అని అన్నారు. ఇలా రెండు విభిన్నమైన ప్రకటనలు ఒకే సమయంలో చేయగలగడం విశేషం.

ఇదే సమయంలో ఏపీలో పొత్తులపై కూడా తనమనసులో ఆలోచనను బయటపెట్టారు పవన్. ఇందులో భాగంగా… ఏపీలో బీజేపీ – టీడీపీ – జనసేన కలసి పోటీ చేయవచ్చు అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రస్తుతానికి అయితే జనసేన బీజేపీల మధ్యనే పొత్తు ఉందని చెప్పిన ఆయన… బీజేపీ, టీడీపీల మధ్య అండర్ స్టాండింగ్ లో సమస్యలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ముఖ్యమంత్రి పదవి సంగతి పక్కనపెడితే… పవన్ కు మాత్రం 2014 పొత్తులు రిపీట్ అవాలనే ఆలోచనే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా బయటపెట్టారని గుర్తుచేస్తున్నారు. ఈ సందర్భంగా… చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలను ఒప్పించే బృహత్కర భాధ్యతను తననెత్తిన పెట్టుకున్నారని అంటున్నారు.

ఆ సంగతులు, పవన్ కోరికలు, బాబు ఇచ్చిన బాధ్యతల సంగతి అలా ఉంటే… మరోపక్క ఎన్డీయే మీటింగ్ కి జనసేనను మాత్రమే పిలిచింది బీజేపీ. 2018లో ఎన్డీయే నుంచి విడిపోయిన టీడీపీని నేడు పక్కన పెట్టింది.

అయితే పవన్ మాత్రం ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కలసిపోటీ చేస్తాయని చెప్పడం అంటే ఆయన కోరికను అలా బయటపెట్టుకున్నారా.. లేక, బీజేపీతో ఆ దిశగా రాయబారం చేసి ఒప్పించగలను అన్న నమ్మకంతో చెప్పారా.. అదీగాక, బీజేపీ పెద్దలకు మూడు పార్టీల పొత్తు అయితేనే తనకు ఆమోదం అని హింట్ ఇచ్చారా అన్నది వేచి చూడాలి.