వైసీపీ ఐసీయూలో ఉంది… భ్రమల్లో నుండి బయటకు వస్తారా?

రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా అధికారికంగా పొడిచిన టీడీపీ – జనసేన పొత్తు అనంతరం పవన్ కల్యాణ్ వారాహి నాలుగో విడత ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అవనిగడ్డలో సభ.. తర్వాత మచిలీపట్నంలో మౌనదీక్ష.. అనంతరం కార్యకర్తలతో భేటీ వరుసగా జరిగాయి! ఈ సందర్భంగా తాజాగా పవన్ కల్యాణ్.. అధికార వైసీపీపై చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉంది!

అధికార వైసీపీ ఐసీయూలో ఉంది.. ఆ పార్టీ పరిస్థితిని చూస్తే జాలేస్తుంది.. తాజాగా అధికార పార్టీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలు. అక్కడ 151 – ఇక్కడ (0-1)! అయినప్పటికీ పవన్ మాత్రం వైసీపీ ని చూసి జాలిపడుతున్నారు. దీంతో ఆయనది భ్రమా.. లేక, జనం పిచ్చోళ్లు అనుకుంటున్నారా అనేది నెటిజన్ల ప్రశ్న!

ఇదే సమయంలో నిజంగా వైసీపీ ఐసీయూలో ఉంటే.. వెంటిలేటర్ పై ఉంచాలా, దించాలా అన్నట్లుగా పోరాడుతుంటే.. జనసేన నిర్వహిస్తోన్న ఈ సభలెందుకు, ఆ సభల్లో ఆ కేకలెందుకు, బీపీ తెచ్చుకుని ఊగిపోవడం ఎందుకు, అంతకంటే ముఖ్యంగా ఈ పొత్తులెందుకు అనే ప్రశ్నలు తదనుగుణంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటు పవన్ మాటల అర్ధమైనా, అటు టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా చెప్పేదైనా ఒకటే…. అరెస్ట్ అనంతరం చంద్రబాబుకు విపరీతమైన సింపతీ వచ్చిందని.

అవును… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయిన దగ్గర నుండి టీడీపీ శ్రేణులతోపాటు ఒకవర్గం మీడియా కూడా భ్రమల్లో బతికేస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదేమిటంటే… చంద్రబాబు అరెస్టుతో జనాల్లో టీడీపీపై సింపతి పెరిగిపోయిందని.. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును 73 ఏళ్ళ వయసులో అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో వేసిందని జనాలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని!

ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కాస్త అటు ఇటుగా అదే ధైర్యంతో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో వారి భ్రమలను, మేనిప్యులేషన్స్ ను ఎదురుతన్నేలా అన్నట్లుగా… తాజాగా టైమ్స్ నౌ – ఈటీజీ సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడించింది. చంద్రబాబు అరెస్టు అనంతరం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి జనాభిప్రాయాలను సేకరించాయి. దీంతో ఈ ఫలితాల్లో సింపతీ ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది ఆసక్తిగా మారింది.

అయితే ఈ సర్వే ఫలితాల ప్రకారం రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు రావొచ్చని తేలీంది. ఇదే సమయలో టీడీపీకి వస్తే ఒక సీటు రావచ్చని తేలగా.. జనసేనకు ఒక్క సీటు కూడా రాదని స్పష్టమైంది! దీంతో… ఈ సర్వే ఫలితాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వైసీపీ యక్ట్విస్టులు… ఐసీయూలో ఉన్నది ఎవరో ఒకసారి పరిశీలించుకోవాలని పవన్ కు హితవు పలుకుతున్నారు.