జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. నివర్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ ఇంతియాజ్ కు వినతిపత్రం ఇచ్చేందుకు పవన్ భారీ ర్యాలీతో మచిలీపట్నం వెళ్లారు. ఈక్రమంలో విజయవాడ నుంచి రోడ్డు మార్గాన కంకిపాడు, మానికొండ మీదుగా గుడివాడ చేరుకున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు.
గుడివాడకు తొలిసారిగా వచ్చానని.. ఇంతటి అపూర్వ స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని పవన్ అన్నారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మాట్లాడిన పవన్ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. ప్రజాప్రతినిథులు బాధ్యతగా ఉండకపోతే ప్రజలు రోడ్లపై పడేస్తారని హెచ్చరించారు. భయపెట్టి పాలిస్తామంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కంకిపాడు నుంచి గుడివాడ వచ్చేవరకు రోడ్డు దారుణంగా ఉంటే ప్రజాప్రతినిథులు ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ నిలదీశారు. ప్రజలు ఇక్కడి ప్రజాప్రతినిథి గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రజాప్రతినిథులు పేకాట క్లబ్బులు నిర్వహించిన సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని పవన్ విమర్శించారు. దాష్టీకం చేసేవారిని.. నోటి దురుసుగా మాట్లాడేవారు ఎవరైనా సరే జనసేన బలంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. గుడివాడ నడిబొడ్డున నిలబడి చెప్తున్నా.. ఆంధ్రప్రజలందరికీ నా అంతిమ శ్వాస వరకూ అండగా నిలబడతానని పవన్ అన్నారు.