పవన్ సినిమాల వసూళ్ళపై పేర్ని నాని నజర్.!

రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడాలి. అధికారంలో వున్నారు గనుక, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడంలో ముందుండాలి.! రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, రాజధాని.. చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా చాలా వున్నాయి.

కానీ, మాజీ మంత్రి పేర్ని నానికి, పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే బిజినెస్ మీద తెగ బాధ కలుగుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవైనా 100 కోట్ల రాబట్టాయా.? అంటూ ప్రశ్నించేశారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన లాభ నష్టాలతో పేర్ని నానికి ఏంటి పని.?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీకి చెందిన నేతలు మాట్లాడుతున్న మాటల విషయంలో ఒకింత అప్రమత్తంగా వుండాలి. మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సినిమా వసూళ్ళ లెక్కల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోవడమేంటో.!

వైఎస్ జగన్ మంత్రి వర్గంలో పని చేశారు పేర్ని నాని. రవాణా శాఖ వ్యవహారాలు, సినిమాటోగ్రఫీ వ్యవహారాలు కూడా ఆయనే చూసుకున్నారు. ఈయనే, వారాహి రంగుని రవాణా శాఖ అనుమతించబోదని చెప్పారు. రాష్ట్రంలోకి రానివ్వబోమనీ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ సుమారు 50 కోట్ల పైన.. 70 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అంటే, సినిమాల వసూళ్ళు 100 కోట్లు ఆ పైన వస్తాయనే కదా.! అలా రాకుండా ఏ నిర్మాత అయినా, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అంత డబ్బులు ఖర్చు చేస్తాడు.?

అది సినిమాల వ్యవహారం. దానికీ, రాజకీయాలకీ సంబంధమేంటి.? వైసీపీ స్థాయిని దిగజార్చుతున్న నాయకుల విషయంలో వైసీపీ అధినాయకత్వం అప్రమత్తంగా వుండాల్సిందే.