18న ఢిల్లీకి పవన్ – చంద్రబాబు… మోడీ స్కెచ్ ఇదే!

మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారం చేజెక్కించుకోవాలని అనుకుంటుంది. అందుకోసం వెయ్యాల్సిన ఎత్తులన్నీ వేస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… పాతమిత్రులు, భాగస్వాములను హస్తినకు పిలిపించుకుంటుంది. ఇందులో భాగంగా… ఏపీ నుంచి టీడీపీ – జనసేనలు కూడా వెళ్లనున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీని టెన్షన్ పెడుతున్నాయని అంటున్నారు. దీంతో కష్టమో సుఖమో పాతమితృలందరినీ మళ్లీ కలవాలని, కలుపుకుపోవాలని, కలిసి ప్రయాణించాలని భావిస్తోందని తెలుస్తుంది. మరోపక్క జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలపడుతుందనే సంకేతాలు వస్తోన్న తరుణంలో… పంతాలకు పోకుండా ఒక మెట్టు దిగైనా పాత మితృలను కలుపుకు పోవాలని భావిస్తున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా… ఈ నెల 18న పాతమిత్రులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని పార్టీలకు ఆహ్వానం అందించినట్టు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనను ఆహ్వానించినట్టు సమాచారం.

దీంతో రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీ – జనసేనలతో కలిసి 2014 ఫలితాలు సాధించాలని భావిస్తోంది. మరోపక్క పవన్ కూడా అలాంటి పొత్తుకోసమే ఎదురుచూస్తున్నారనే సంకేతాలు ఎన్నోసార్లు ఇచ్చారు.

అయితే టీడీపీలో ఒక వర్గం మాత్రం బీజేపీతో పొత్తుకు అంగీకరించడంలేదని తెలుస్తుంది. బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉందని.. పైగా వైఎస్ జగన్ తో బీజేపీ నేతలు సాన్నిహిత్యంగానే ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం… ఏపీలో జగన్ లాంటి నేతతో పోరాడాలంటే జాతీయస్థాయిలో బీజేపీ లాంటి పార్టీ తోడుకావాలని భావిస్తున్నారని తెలుస్తుంది.

ఇన్ని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, లెక్కలు, వాటిలో ఉన్న చిక్కుల మధ్య ఈ నెల 18న హస్తినలో జరగబోయే మీటింగులో ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయి.. మరెలాంటి పొత్తులు వికసిస్తాయి అనేది వేచి చూడాలి.

కాగా… ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ, శివసేన (ఏకనాథ్‌ షిండే వర్గం), రాష్ట్రీయ లోక్‌ జనశక్తి (చిరాగ్‌ పశ్వాన్‌ వర్గం), అన్నాడీఎంకే, అప్నాదళ్‌ (సోనెలాల్‌), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (మేఘాలయ), నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (నాగాలాండ్‌), ఆల్‌ జార్ఘండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (జార్ఖండ్‌) తో పాటు పలు చిన్నా చితక పార్టీలున్న సంగతి తెలిసిందే.