ఏపీలో పొత్తుల రాజకీయం ఓపట్టాన్న అర్ధమవ్వడంలేదనే కామెంట్లు రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. ఇందులో భాగంగా… రాబోయే ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేనల పొత్తు రాజకీయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
అవును… ఏపీలో పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళుగా టీడీపీ వైపుగా సాగుతున్నారని ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో వారాహి యాత్ర సందర్భంగా తాను సీఎం అని గట్టిగా చెప్పుకున్నారు. తర్వాత మళ్లీ నాలుక కరుచుకున్నానని ప్రకటించుకున్నారు. మరోపక్క మా ప్రభుత్వం వస్తుందని కూడా చెప్పగలిగారు. ఈ స్థాయిలో పరిపూర్ణమైన కన్ ఫ్యూజన్ ని చూపించగలిగారు పవన్.
మరోవైపు టీడీపీ నేతలు పవన్ పై ఈగవాలనివ్వరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ పై ప్రభుత్వం స్పందించిన వెంటనే టీడీపీ నేతలు మైకుల ముందుకు వస్తుంటారు. పవన్ కు మద్దతుగా వ్యాఖ్యానిస్తుంటారు. పరోక్షంగా… పవన్ తో కలిసి ప్రయాణిస్తున్నామనే సంకేతాలు ఇస్తుంటారు.
ఇదే సమయంలో జనసేన అధినేత కూడా చంద్రబాబుతోనే కలిసి నడవబోతున్నట్లు ప్రకటిస్తుంటారని అంటున్నారు. ఇందులో భాగంగా… పొత్తుల చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, సీట్ల సర్ధుబాటులో కూడా ఒక రహస్య ఒప్పందం జరిగిందని.. అందువల్లే పవన్ కల్యాణ్ గోదవరి జిల్లాల్లో కూడా సెలక్టివ్ గా కొన్ని నొయోజకవర్గాల్లోనే యాత్ర చేశారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది. చంద్రబాబును దూరంపెడుతూ… పవన్ తో ఉన్న మిత్రత్వాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇంకో వైపు ఈ నెల 18న ఢిల్లీ వేదికగా ఎన్డీయే పార్టీల కీలక సమావేశానికి పవన్ ను ఆహ్వానించారు.
అవును… ప్రధాని నరేంద్ర మోడీ – కేంద్ర హోం మంత్రి అమిత్ షా – బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు దాదాపుగా ఇరవై ఎన్డీయే మిత్ర పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నాయి. ఏపీ నుంచి ఒక్క జనసేన మాత్రమే ఈ భేటీకి హాజరవుతోంది. ఆ మేరకు బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం లభించింది.
ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన మాత్రమే ఈ అతి ముఖ్యమైన ఎన్డీయే భేటీకి హాజరవుతోంది. ఇలా పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఇస్తున్న రాజకీయ ప్రాధాన్యతగా అంతా భావిస్తున్నారు. ఇక ఎన్డీయే భేటీకి టీడీపీని పిలుస్తారు అని అంతా అనుకున్నారు. ప్రచారం కూడా ఎల్లో మీడియాలో ఒక లెవెల్ లో సాగింది. కానీ తీరా చూస్తే జనసేన మాత్రమే అటెండ్ అవుతోందని తెలుస్తోంది.
దీంతో… పవన్ కు చంద్రబాబు కు మధ్య దూరం పెరిగేలా బీజేపీ పావులు కదుపుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇది మరింత కీలకంగా మారుస్తూ… రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఒంటరి చేసి… బీజేపీ – జనసేనలు కలిసి పోటీ చేసే ఎన్నో కన్ని ఎంపీ సీట్లు సాధించాలని భావిస్తున్నారని అంటున్నారు.
మరి ఈ దశలో సాగుతున్న బీజేపీ రాజకీయాలు… ఏపీలో టీడీపీ – జనసేనల మధ్య ఎంతమేరకు గ్యాప్ తీసుకొస్తుందనేది వేచి చూడాలి. ఈ సమయంలో జనసేన పవన్ తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకం అని అంటున్నారు పరిశీలకులు.