ఏపీ స్కి ల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఈ రోజు రాజమండ్రి వచ్చిన ఆయన… ముందుగా బాలకృష్ణ, లోకేష్ లను కలిశారు. ములాకత్ లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఈ ముగ్గురూ జైలులో బాబుతో భేటీ అయ్యారు.
ఈ ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయని… ఈ నిర్ణయం ఇంతకముందు తీసుకుఓలేదని, ఇప్పుడు బాబు అరెస్ట్ తర్వాత ఈ మేరకు ఫిక్సయ్యానని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… రేపే వచ్చినా… టీడీపీ – జనసేనా కలిసే పోటీ చేస్తాయని పవన్ స్పష్టం చేశారు.
చంద్రబాబుతో ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ… గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని విమర్శించారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీని అడ్డుకోలేమని… 2024 లో టీడీపీ – జనసేన కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపటినుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యచరణను సిద్ధం చేసుకుంటామని పవన్ చెప్పుకొచ్చారు.
ఇలా టీడీపీ – జనసేన కలిసివేళ్లే పొత్తులో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన జనసేన అధినేత.. అదే జరుగుతుందని జోస్యం చెబుతూ, అదే జరగలాని కోరుకున్నారు. అంటే… తాను నిర్ణయం తీసేసుకున్నాను… మీ నిర్ణయం మీ ఇష్టం అని పవన్ పరోక్షంగా చెప్పారన్న మాట.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానని, అందుకే నాడు చంద్రబాబుకు, దేశ ప్రధానిగా మోడీకి మద్దతు ఇచ్చానని పవన్ తెలిపారు. తర్వాత కాలంలో 2019 ఎన్నికల నాటికి ఇద్దరి మధ్యా పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు రావడం వల్ల విడివిడిగా పోటీచేసినట్లు తెలిపారు.
ఇక, వైసీపీ నేతలు తమపై రాళ్లు వేసేముందే ఆలోచించుకోవాలని తెలిపిన పవన్… హిట్లర్ నాజీ సైనికులను యూదులు ఎలా వెంటపడి తరిమారో అలాగే వైసీపీకి చెందిన రౌడీమూకలను తరుముతామని, యుద్ధమే అంటే యుద్ధమే అని, ఎవరినీ వదలనని చెప్పుకొచ్చారు. ఫలితంగా ఈ ప్రెస్ మీట్ తో… రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసేపోటీచేస్తాయని తేల్చి చెప్పారు పవన్.